ICC Champions trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ లో టీమ్ ఇండియా (team India) బంగ్లాదేశ్ (Bangladesh) తో తలపడబోతోంది. గురువారం దుబాయ్ వేదికగా మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కూడా కీలకం కావడంతో.. టీమిండియా అన్ని అస్త్ర శస్త్రాలతో బరిలోకి దిగుతోంది.
బంగ్లాదేశ్ పై భారత జట్టుకు మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో టీమిండియా ఏమాత్రం అజాగ్రత్తను పాటించడం లేదు. పైగా టాప్ టీమ్ తో తలపడినట్టుగానే.. ఆడతామని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ” మాకు ప్రతి మ్యాచ్ కీలకం. ఎందుకంటే చాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. బంగ్లాదేశ్ అయినంత మాత్రాన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించలేం. మామూలు జట్టని తేలికగా తీసుకోము.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ -8 లో బంగ్లాదేశ్ జట్టు కూడా ఒకటి. వెస్టిండీస్, శ్రీలంకను పక్కన పెట్టి మరి ఆ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతోంది. 2007లో జరిగిన ఓ ఐసీసీ ఈవెంట్ లో మాకు షాక్ ఇచ్చింది. అందువల్లే ఆ జట్టును మేము లైట్ తీసుకోమని” రోహిత్ వ్యాఖ్యానించాడు.
అందుకోసమే ఐదుగురు
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. దుబాయ్ లాంటి మైదానాలలో ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం అంటే దాదాపు సాహసమనే చెప్పాలి. ఐతే దీనిపై రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు..” మీకు ఐదుగురు స్పిన్నర్లు మాత్రమే కనిపిస్తున్నారు. నాకు మాత్రం ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు కనిపిస్తున్నారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రాకతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ అవుతుంది. కులదీప్ యాదవ్ ఎలాగూ మ్యాజికల్ బంతులు వేస్తాడు. అది ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందికరంగా మారుతుంది. పైగా దుబాయ్ లో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రిపూట మంచు కూడా కురుస్తుంది. అలాంటప్పుడు స్పిన్ బౌలర్లతో ప్రయోజనం ఉంటుంది. బౌలింగ్ కనుక మెరుగ్గా వేస్తే బ్యాటర్ల పై ఒత్తిడి తగ్గుతుంది. అంతిమంగా అది జట్టు విజయానికి కారణం అవుతుంది. మైదానం బట్టి ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది. జట్టు అవసరాల దృష్ట్యా ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేతప్ప వేరే ఉద్దేశం ఉండదు. అయినా ప్రయోగాలు చేయకపోతే విజయాలు ఎలా సాధ్యమవుతాయి. ప్రత్యర్థి బలహీనతల ఆధారంగానే ఐదుగురు బౌలర్లను తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్న ఐదుగురు ఆటగాళ్లను కేవలం స్పిన్ బౌలర్ల కోణంలో చూడద్దని” రోహిత్ వ్యాఖ్యానించాడు.కాగా, భారత్ – బంగ్లాదేశ్ పరస్పరం తలపడిన చివరి 5 వన్డేలలో.. బంగ్లాదేశ్ 3, భారత్ రెండు గెలిచింది. మొత్తంగా భారత్ – బంగ్లాదేశ్ పరస్పరం 41 వన్డేలలో తలపడ్డాయి. ఇందులో భారత్ 32 మ్యాచ్ లు గెలిచింది. బంగ్లాదేశ్ 8 మ్యాచ్ ల లో విజయం సాధించింది. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.