Rohit Sharma: అంత బాధను అనుభవించా? MI కెప్టెన్ గా తొలగింపు తర్వాత తొలిసారి హిట్ మాన్ ఏమన్నాడంటే..

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో కెప్టెన్ స్థానం నుంచి రోహిత్ శర్మను పక్కనపెట్టింది. అతడికి బదులుగా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయితే దీనిపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 3, 2024 5:29 pm

Rohit Sharma

Follow us on

Rohit Sharma: దేశంలో ఐపీఎల్ సందడి కొనసాగుతున్నప్పటికీ.. అన్ని దేశాల జాతీయ జట్ల దృష్టి మొత్తం టి20 వరల్డ్ కప్ మీదే ఉంది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి.. ఐసీసీ టి20 వరల్డ్ కప్ కోసం కసరత్తులు మొదలుపెట్టాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కొనసాగనున్నాయి. భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే టి20 వరల్డ్ కప్ ఆడే జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఇందులో ఈసారి యశస్వి జైస్వాల్, శివం దూబే, సంజు శాంసన్, రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్ వంటి వారికి బీసీసీఐ అవకాశం కల్పించింది. జట్టు ప్రకటన అనంతరం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.. ఈ సందర్భంగా విలేకరులు “ముంబై ఇండియన్ కెప్టెన్ గా ఎందుకు తొలగించారని” రోహిత్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు.

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో కెప్టెన్ స్థానం నుంచి రోహిత్ శర్మను పక్కనపెట్టింది. అతడికి బదులుగా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయితే దీనిపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ అభిమానులు హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి నేరుగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ముంబై ఆడే మ్యాచ్లో ఫ్ల కార్డులను ప్రదర్శించారు.. ఇది క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని చెబుతూ, అభిమానులను రోహిత్ శర్మ వారించాడు. అలా చేయడం సరికాదు అంటూ హితవు పలికాడు.. అయితే దీనిపై తొలిసారిగా రోహిత్ శర్మ నోరు విప్పాడు. ” కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టడం బాధ కలిగించింది. ఇబ్బందిగా అనిపించింది. జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగవు. ఇలాంటివన్నీ సహజ పరిణామాలు. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఆడటం నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. నేను కెప్టెన్ కాకముందు ఎంతోమంది సారధ్యంలో ఆడాను. అలా ఆడటం నాకు కొత్త కాదు. అందులో తేడా కూడా కనిపించలేదు. ఇక ఈ సీజన్లో ముంబై జట్టుకు ఘన విజయాలు, భారీ భాగస్వామ్యాలు నమోదు చేయాలని భావించాం. ఆ వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఓపెనర్ గా వచ్చినప్పుడు ధాటిగా ఆడాల్సి ఉంటుందని” రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

ఇక ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో రోహిత్ శర్మ 10 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటివరకు 314 రన్స్ చేశాడు..ఇందులో ఒక సెంచరీ ఉంది. ముంబై జట్టు పది మ్యాచ్లు ఆడి, మూడు విజయాలు అందుకుంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోతూ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.. ఎన్నో అంచనాలతో ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ జట్టు.. వాటిని అందుకోలేక చతికిల పడుతోంది. జట్టు ఆటగాళ్లలో విభేదాలు ఏర్పడి, రెండు గ్రూపులుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. దీనికి హార్దిక్ పాండ్యా నాయకత్వ లేమి కూడా తోడైంది. ఫలితంగా ముంబై జట్టు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తుంది. అద్భుతాలు జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు లేవు. గత సీజన్లలో వరుస వైఫల్యాలను మూట కట్టుకున్న ముంబై జట్టు.. ఈసారి కెప్టెన్ మారడంతో గాడిన పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అదే స్థాయిలో నాసిరకమైన ఆట తీరును ప్రదర్శిస్తూ.. అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.