America: ఏ కొడుకు నైనా తన తండ్రి గారాబంగా పెంచుతాడు. ఎలా ఉన్నా తన గుండెలకు హత్తుకుంటాడు. ప్రేమతో ముద్దులు పెడతాడు. భుజాలపై మోస్తాడు. తన చేతులతో ఎత్తుకొని లోకం పోకడను చూపిస్తాడు. తల్లి నవ మాసాలు మోస్తే.. తండ్రి ఆ తదుపరి భారాన్ని భరిస్తాడని అంటారు. కానీ, మీరు చదవబోయే ఈ స్టోరీలో ఈ తండ్రి పూర్తి విభిన్నం. తన కుమారుడు లావుగా ఉన్నాడనే నెపంతో దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ అతను ఏం చేశాడంటే..
అమెరికాలోని న్యూ జెర్సీ ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్ గ్రెగర్ అనే వ్యక్తికి భార్య, కుమారుడు కోరి ఉన్నాడు. ఆ కుమారుడు అక్కడ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుతున్నాడు. కోరి చూడ్డానికి బొద్దుగా ఉంటాడు. అతడు ఉండాల్సిన దానికంటే ఎక్కువ లావుగా కనిపిస్తాడు. అది క్రిస్టోఫర్ కు నామోషీగా అనిపించింది. దీంతో తన కుమారుడి లావును తగ్గించాలని, అతడి శరీరాన్ని నాజూకుగా చేయాలని భావించాడు. ఈ క్రమంలో కోరిని ట్రెడ్ మిల్ మీద బలవంతంగా పరుగులు తీయించాడు. కనీసం ఆ బాలుడి వయసు కూడా పరిగణలోకి తీసుకోకుండా.. ట్రెడ్ మిల్ వేగాన్ని అమాంతం పెంచాడు. ఆ వేగానికి ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చేర్పించగా కొద్ది రోజులకు కన్నుమూశాడు.. మూడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన సంబంధించి.. పోలీసులు విచారణ నిర్వహిస్తుండగా, ఆ దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
ఆ బాలుడి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో క్రిస్టోఫర్ ను 2021లో పోలీసులు అరెస్టు చేశారు.. ఆ కేసు కు సంబంధించి మూడేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దృష్టికి సాక్ష్యాలుగా ఆ బాలుడు ట్రెడ్ మిల్ మీద పరుగులు తీస్తున్న దృశ్యాలను అక్కడి పోలీసులు తీసుకొచ్చారు. 2021 మార్చి 30న క్రిస్టోఫర్ తన కుమారుడు కోరిని స్థానికంగా ఉన్న ఓ ఫిట్ నెస్ సెంటర్ కు తీసుకెళ్లాడు. కోరిని బలవంతంగా ట్రెడ్ మిల్ పై పరుగులు పెట్టించాడు. ఆ బాలుడు ఇబ్బంది పడుతున్నా సరే ఒప్పుకోలేదు. పైగా వేగాన్ని మరింత పెంచాడు. దీంతో కోరి పలుమార్లు కింద పడ్డాడు. అయినప్పటికీ క్రిస్టోఫర్ కు ఊరుకోలేదు. తాను పరిగెత్తలేనని చెప్పినప్పటికీ కోరిని కొట్టి పరుగులు పెట్టించాడు. ఇలా కొద్ది రోజులకు కోరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ ఏడాది ఏప్రిల్ 1న ఆ బాలుడిని తల్లి స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్లింది.
వైద్యులు పరీక్ష నిర్వహించగా అసలు విషయం వెలుగు చూసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఏప్రిల్ 2న కోరి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యులు తీసిన స్కానింగ్ లో అతని అంతర్గత అవయవాలకు తీవ్రంగా గాయాలైనట్టు తేలింది. గుండె, కాలేయానికి గాయాలు కావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్టు వైద్యులు గుర్తించారు.. ఇక ఆ ఏడాది జూలై నెలలో కోరి తండ్రి క్రిస్టోఫర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ నేపథ్యంలో పోలీసులు న్యాయమూర్తి ఎదుట కోరి ట్రెడ్ మిల్ పై పరుగులు తీస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. వాటిని చూసి కోరి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. అమెరికన్ చట్టాల ప్రకారం కోరి తండ్రికి జీవిత ఖైదు పడే అవకాశం కనిపిస్తోంది.