https://oktelugu.com/

Rohith Sharma : ముంబై ఇండియన్స్ ను వీడుతున్న రోహిత్ శర్మ.. వేలంలో ఏ జట్టులోకి వెళ్తాడంటే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. వచ్చే ఐపిఎల్ సీజన్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గత సీజన్లో రోహిత్ శర్మను పక్కనపెట్టి ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. గుజరాత్ జట్టు నుంచి అతడిని రిటైన్ చేసుకొని కెప్టెన్ గా నియమించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 29, 2024 / 09:20 PM IST
    Follow us on

    Rohith Sharma : టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఆ స్థాయిలో విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు గడించాడు. హిట్ మ్యాన్ గా సరికొత్త రికార్డులను సృష్టించాడు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ.. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా పై విజయం సాధించి.. టీమిండియా కు ట్రోఫీ అందించాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఓటమిని దానిద్వారా భర్తీ చేశాడు. టి20 వరల్డ్ కప్ టీం ఇండియా గెలిచిన తర్వాత .. టీ -20 ఫార్మాట్ కు రోహిత్ గుడ్ బై చెప్పేశాడు.. ఇటీవల కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. శుక్రవారం సాయంత్రం ఇండియాకు తిరిగివచ్చాడు. శనివారం సాయంత్రం శ్రీలంక బయలుదేరి వెళ్లిపోయాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. మూడు టి20 లు, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది. టి20 టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. మూడు టి20 మ్యాచ్ లో భాగంగా ఇప్పటికే టీమ్ ఇండియా 2-0 తేడాతో సిరీస్ దక్కించుకుంది. మొదటి టీ20లో 43 రన్స్, రెండవ టి20 లో 7 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీలు అందుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది. మంగళవారం చివరి t20 మ్యాచ్ భారత్ ఆడుతుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత ఆగస్టు 3 నుంచి శ్రీలంకతో వన్డే టోర్నీ మొదలవుతుంది. 3 మ్యాచ్ ల ఈ టోర్నీకి రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. అందులో భాగంగానే విహారయాత్ర నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత.. వెంటనే శ్రీలంక వెళ్లిపోయాడు. అతనితోపాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు.

    ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. వచ్చే ఐపిఎల్ సీజన్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే గత సీజన్లో రోహిత్ శర్మను పక్కనపెట్టి ముంబై యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. గుజరాత్ జట్టు నుంచి అతడిని రిటైన్ చేసుకొని కెప్టెన్ గా నియమించింది. హార్దిక్ కెప్టెన్ గా వచ్చిన నాటి నుంచి అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి ముంబై జట్టు ఆటతీరు కూడా తోడు కావడంతో నెట్టింట హార్దిక్ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం కూడా ఒడిదుడుకులకు గురైంది. ఇటీవల హార్దిక్ తన భార్య నటాషాకు విడాకులు కూడా ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ జట్టు సారధ్య బాధ్యతల నుంచి తొలగించిన నేపథ్యంలో రోహిత్ శర్మ తన దారి తను చూసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నెల 31న బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లతో సమావేశం కానుంది. రిటైన్ నిబంధనను 8 మంది ఆటగాళ్లకు పెంచాలని జట్ల యాజమాన్యాలు కోరుతుంటే.. పాత నిబంధన ప్రకారమే రిటైన్ సాగుతుందని బిసిసిఐ చెబుతోంది. ఫ్రాంచైజీ జట్లు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఒక అడుగు వెనక్కి వేస్తుందా? లేక పాత పద్ధతినే కొనసాగిస్తుందా? అనేది చూడాల్సి ఉంది.

    ఇక ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి వేలం త్వరలో జరగనుంది. ఈ వేలంలో రోహిత్ శర్మ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ముంబై జట్టు నుంచి అతడు బయటికి వస్తే ఢిల్లీ లేదా లక్నో, కోల్ కతా యాజమాన్యాలు అతడిని కెప్టెన్ గా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 2013లో ముంబై జట్టు నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన రోహిత్.. ఐదు ట్రోఫీలు అందించాడు. గత మూడు సీజన్లలో అతడు నాయకుడిగా విఫలం కావడంతోనే… హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించామని అప్పట్లో ముంబై జట్టు యాజమాన్యం ప్రకటించింది. అయితే తనను కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పించడంతో రోహిత్ ముంబై జట్టు నుంచి బయటికి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఒకవేళ మెగా వేలంలోకి రోహిత్ కనుక వెళితే కచ్చితంగా 30 కోట్లకు మించిన ధరతో ఫ్రాంచైజీ జట్లు కొనుగోలు చేస్తాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.