Maharashtra : అది మహారాష్ట్ర.. సింధు దుర్గ్ జిల్లాలోని సోనుర్లి అనే గ్రామ శివారు ప్రాంతం. ఆ ప్రాంతం దట్టమైన అడవికి సమీపంలో ఉంటుంది.. మామూలుగానే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ అంతంతమాత్రంగా ఉంటుంది. పైగా అక్కడి వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుంది. ఏడాదిలో ఎండాకాలం మినహా.. మిగతా రోజుల్లో వర్షం లేదా చలి వీస్తుంది.. అందుకే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే చాలామంది భయపడుతుంటారు. కొంతమంది సాహసికులు ట్రెక్కింగ్ కు వెళ్తుంటారు. అయితే అది కూడా ఒక నిర్ణీత ప్రాంతం వరకే.. దాన్ని మించి వాళ్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. అక్కడ అటవీ శాఖ కూడా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది. పైగా ఆ ప్రాంతంలో క్రూర మృగాలు సంచరిస్తుంటాయి. అయితే ఆ గ్రామంలో చాలామందికి గొర్రెలను సాకడమే జీవనాధారం. అలా ఓ వ్యక్తి తన గొర్రెలను ఆ అటవీ పరిసర ప్రాంతాల్లో మేపుతుండగా ఓ మహిళ అరుపులు వినిపించాయి. దీంతో అతడు కంగారుపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడు అడవి నుంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.
అతడి ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ అరుపులు వినిపిస్తున్న తీరును దృష్టిలో పెట్టుకొని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇనుప గొలుసులతో ఓ చెట్టుకు ఓ మహిళ కట్టేసి ఉంది. ఆమెను పోలీసులు గుర్తించారు. ఆమె అప్పటికే నీరసానికి గురైంది. గట్టిగా మాట కూడా మాట్లాడలేకపోతోంది. కళ్ళన్నీ కందిపోయాయి. గొంతు మొత్తం పిడచకట్టకు పోయింది. శరీరమంతా నల్లగా మారింది. ఇనుప గొలుసుల నుంచి విడిపించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నం చేయడంతో రెండు చేతుల మణికట్టు ప్రాంతాలు కమిలిపోయాయి. అయితే ఆ మహిళను వారు తనిఖీ చేయగా అమెరికా పాస్ పోర్ట్, ఇండియన్ ఆధార్ కార్డు, ఇతర ఆధారాలు లభ్యమయ్యాయి. అయితే ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఆమె చేతికి ఉన్న ఇనుప గొలుసును విడగొట్టి.. ప్రత్యేక వాహనంలో బయటకి తీసుకొచ్చారు. అయితే గోవా ప్రభుత్వ వైద్య కళాశాలలో మానసిక స్థితిని నయం చేసేందుకు వైద్య విధానం అందుబాటులో ఉండడంతో ఆమెను అక్కడికి తరలించారు.
ఆమె వద్ద ఉన్న ఆధారాల ప్రకారం పోలీసులు తనిఖీ చేయగా.. ఆ మహిళ తమిళనాడు రాష్ట్రానికి చెందిన లలితా కయీ అని గుర్తించారు.. ఆమె ఆధార్ కార్డు వద్ద ఉన్న చిరునామా ప్రకారం తమిళనాడు పోలీసులను సంప్రదించారు. దీంతో వారు ఆ మహిళ ఆధార కార్డు పై ఉన్న చిరునామా వద్దకు వెళ్లారు. అక్కడ ఇంటి పక్కల వాళ్లను వివరాలు అడిగారు. అయితే వారు స్పష్టమైన సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు పూర్తిస్థాయి సమాచారం సేకరించడం కష్టంగా మారింది. అయితే ఆ మహిళ కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఆమె దగ్గర భారీగా ఆస్తి ఉందని, అది కాజేసేందుకు దగ్గర బంధువులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలియ వచ్చింది. అయితే పూర్తి వివరాలు తెలిసేందుకు మరి కొంత సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు. తమిళనాడు పోలీసులతో కలిసి మహారాష్ట్ర పోలీసులు కేసును విచారణ జరుపుతున్నారు. కాగా దట్టమైన అడవిలో ఒక మహిళను ఇనుప గొలుసులతో కట్టేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం గోవా మెడికల్ కాలేజీలో ఆ బాధిత మహిళ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి స్థిమితంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.