Rohit Sharma: టి20 వరల్డ్ కప్ సాధించి వారం గడుస్తున్నప్పటికీ.. టీమిండియా ఇంకా ఆ ఆనందం నుంచి బయటపడలేదు. గురువారం తెల్లవారుజామున బార్బడోస్ నుంచి వచ్చిన టీమిండియా.. టి20 వరల్డ్ కప్ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ నిర్వహించిన విక్టరీ పరేడ్ లో పాల్గొన్నది. ముంబైలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లక్షలాదిగా అభిమానులు హాజరయ్యారు. తమ అభిమాన క్రికెటర్లను తనివితీరా చూసుకున్నారు. తమ స్మార్ట్ ఫోన్లలో బంధించారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ముఖ్యంగా ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడె మైదానం వరకు సాగిన విక్టరీ పరేడ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీమిండియా క్రికెటర్ల బస్సు ముందుకు సాగుతుంటే.. దానిని అనుసరించారు.
వాంఖడె మైదానంలో నిర్వహించిన అభినందన సభలో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మొదలుపెడితే విరాట్ కోహ్లీ వరకు ప్రతి ఒక్కరు వరల్డ్ కప్ లో తమ ప్రయాణాన్ని అద్భుతంగా వివరించారు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే అభిమానులు తన్మయత్వానికి గురయ్యారు. ఇది కదా మేము మీ దగ్గర నుంచి ఆశించింది అంటూ పొంగిపోయారు. అభినందన సభలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా మాట్లాడారు. ఈ విజయం తమకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. అనంతరం 125 కోట్ల విలువైన చెక్కును టీమిండియా ఆటగాళ్లకు అందించారు.
అభినందన సభ ముగిసిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన స్వగృహానికి చేరుకున్నాడు.. ఈ క్రమంలో తన ఇంటికి వెళ్లే ప్రవేశ మార్గంలో చిన్ననాటి స్నేహితులు రోహిత్ శర్మకు సర్ప్రైజ్ ఇచ్చారు. అంతమంది స్నేహితులు ఒకేసారి కనిపించడంతో రోహిత్ కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. వరల్డ్ కప్ విన్నర్.. టీమిండియా కెప్టెన్.. హ్యాపీ వెల్కమ్ అంటూ వారు నినాదాలు చేశారు. చప్పట్లు కొట్టి రోహిత్ శర్మను అభినందించారు. అనంతరం వరల్డ్ కప్ సమయంలో రోహిత్ శర్మ హావభావాలను అతడి ముందు మరోసారి ప్రదర్శించారు. టి20 వరల్డ్ కప్ అందుకునే సమయంలో రోహిత్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సిని అనుసరించాడు. 2022లో ఫిఫా ఫుట్ బాల్ కప్ గెలిచిన సమయంలో మెస్సీ భిన్నమైన వాకింగ్ స్టైల్ తో కప్ అందుకున్నాడు. అప్పట్లో అది సోషల్ మీడియాను ఊపేసింది. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ కూడా కప్ అందుకునే సమయంలో అదే స్టైల్ అనుసరించాడు. దానిని రోహిత్ ఫ్రెండ్స్ అతడి ముందు ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా అతడు బిగ్గరగా నవ్వాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
HERO WELCOME FOR CAPTAIN ROHIT.
– Family, Childhood friends, Tilak giving a memorable welcome for Ro as he returns to home. ❤️pic.twitter.com/dQz4dc8x0p
— Johns. (@CricCrazyJohns) July 5, 2024