Ind Vs Nz 3rd Test: సిరీస్ కోల్పోయినా రోహిత్ బ్యాటింగ్ మారలేదు.. మారుతుందని నమ్మకమూ లేదు.. నాయకా ఇలాగైతే కష్టమే!

ఓవైపు రంజీలలో వర్ధమాన ఆటగాళ్లు పరుగుల మీద పరుగులు తీస్తున్నారు. జట్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి తహతహలాడుతున్నారు.. ఈ క్రమంలో జట్టులో ఒక్కో స్థానానికి విపరీతమైన పోటీ ఉంది. కానీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఇవేవీ పట్టడం లేదు.. పైగా తన నిర్లక్ష్యమైన బ్యాటింగ్ ను అతడు విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. టెస్ట్ సిరీస్ కోల్పోయినప్పటికీ.. తన బ్యాటింగ్ స్టైల్ మార్చుకోవడానికి నిరాకరిస్తున్నాడు..

Written By: Anabothula Bhaskar, Updated On : November 1, 2024 5:23 pm

Ind Vs Nz 3rd Test(3)

Follow us on

Ind Vs Nz 3rd Test: బెంగళూరు టెస్ట్ లో భారత్ ఓడిపోయింది. పూణే మైదానంలో చిత్తుగా ఓటమిపాలైంది. 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఇలాంటప్పుడు సహజంగానే కెప్టెన్ పై విమర్శలు వస్తూనే ఉంటాయి. దీనికి రోహిత్ శర్మ కూడా మినహాయింపు కాదు. కానీ వరుస ఓటములు.. బ్యాటింగ్ వైఫల్యాలనుంచి కెప్టెన్ రోహిత్ గుణపాఠం నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. సీనియర్ ఆటగాళ్లు విమర్శిస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో అభిమానులు దెప్పిపొడుస్తున్నప్పటికీ రోహిత్ మారిన దాఖలాలు గోచరించడం లేదు. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్టులలో రోహిత్ ఒక్కసారి మాత్రమే 52 పరుగులు చేశాడు. మిగతా ఇన్నింగ్స్ లలో 2, 0, 8 పరుగులకు మాత్రమే పరిమితమయ్యాడు. తాజాగా జరుగుతున్న ముంబై టెస్ట్ లోను అతడు తొలి ఇన్నింగ్స్ లో 18 పరుగులు మాత్రమే చేశాడు.. మూడు ఫోర్లు కొట్టి సౌకర్యవంతంగా కనిపించిన రోహిత్.. హెన్రీ బౌలింగ్లో కెప్టెన్ లాతం కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. వాస్తవానికి హెన్రీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేయడంతో.. అది రోహిత్ బ్యాట్ చివరి అంచును తగులుతూ లాతం చేతిలో పడింది.

విమర్శల మీద విమర్శలు

రోహిత్ దారుణమైన ఆట తీరు పట్ల సీనియర్ ఆటగాళ్లు విమర్శలు చేస్తున్నారు.. ముఖ్యంగా సంజయ్ మంజ్రేకర్ లాంటివాళ్ళయితే రోహిత్ బ్యాటింగ్ శైలి మార్చుకోవాలని సూచిస్తున్నారు. టీమ్ ఇండియా వరుస మ్యాచ్లలో ఓడిపోయినప్పటికీ రోహిత్ గుణపాఠం నేర్చుకోవడం లేదని సంజయ్ మండిపడుతున్నాడు..” న్యూజిలాండ్ కెప్టెన్ లాతం సూపర్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. జట్టును సమష్టిగా ముందుకు తీసుకెళ్తున్నాడు.. కానీ రోహిత్ లో ఆ లక్షణాలు కల్పించడం లేదు. అతడికి ఏమైందో అర్థం కావడం లేదు. న్యూజిలాండ్ సిరీస్లో దారుణంగా విఫలమవుతున్నాడు. మరీ దరిద్రంగా అతడు 0 పరుగులకు అవుట్ కావడం బాధ కలిగిస్తున్నది. రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకపోవడంతో అతని వయసు గురించి ప్రస్తావన వస్తోంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదనుకుంటే రోహిత్ ఆట తీరు మార్చుకోవాలని” సంజయ్ హితవు పలుకుతున్నాడు. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ 18 పరుగులకు అవుట్ కావడం పట్ల నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ రోహిత్ తన ఆట తీరు మార్చుకోవాలనే వ్యాఖ్యలు మిన్నంటుతున్నాయి.కాగా, ఇప్పటికే రోహిత్ శర్మ వయసు పై చర్చ మొదలైంది. అతడి కి బదులుగా మరొక వ్యక్తిని టెస్ట్ కెప్టెన్ గా నియమించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.