Rohit Sharma: “అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది. లార్డ్స్ లోనే చివరి వన్డే ఆడతాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ జట్టులో పరిగణించే అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పటికే మేనేజ్మెంట్ ఒక క్లారిటీతో ఉంది” ఇదిగో ఇలా సాగిపోతున్నాయి టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ కెరియర్ గురించి విశ్లేషణలు.
ఎవరికివారు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఇలా విశ్లేషణలు చేసుకుంటూ పోయారు. చివరికి బీసీసీఐ రంగంలోకి దిగి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఈ స్పెక్యులేషన్ ఆగలేదు. ఒక దశలో రోహిత్ ఆట చూసేందుకు ఆయన సతీమణి.. తల్లిదండ్రులు లార్డ్స్ వచ్చారు. దీంతో అతడు రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమని అందరూ ఒక అంచనాకు వచ్చారు. కానీ ఇంతలోనే రోహిత్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
తన రిటైర్మెంట్ గురించి రకరకాల వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో తొలిసారి రోహిత్ శర్మ నోరు విప్పాడు..” నా రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలు సరికాదు. అసలు నాకు అలాంటి ఆలోచన లేదు. ఇంగ్లాండ్ తో రెండవ వన్డే ముగిసిన తర్వాత రిటైర్మెంట్ గురించి ప్రచారం మొదలైంది.. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇలాంటి ప్రచారాలు కొత్త కాదు. నా కెరియర్ మొదలైన నాటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇటువంటి ప్రచారాలు లేకపోతే ఆటలో కిక్కు ఉండదు” అంటూ రోహిత్ బిసిసిఐ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఇదే విషయం మీద కెప్టెన్ గిల్ కూడా స్పందించాడు.”రోహిత్ రిటైర్మెంట్ గురించి నాకు తెలియదు. ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటే ముందుగానే నాకు తెలుస్తుంది కదా. డ్రెస్సింగ్ రూమ్ లో దాని గురించి చర్చ కూడా జరగలేదు. దీని గురించి అనవసరమైన ప్రచారం తప్పా ఉపయోగం లేదు. ఇప్పటికైనా ఇటువంటి వదంతులను ప్రచారం చేయకుండా ఆపివేయడం మంచిదని” గిల్ సూచించాడు. దీంతో ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాలో.. ప్రధాన మీడియాలో రోహిత్ చుట్టూ జరిగిన చర్చ ఆగిపోయింది. అన్నట్టు లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ మీద రోహిత్ వీరోచితమైన శతకం చేసాడు. కాకపోతే మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్ల టీమిండియా గెలిచే మ్యాచ్ ఓడిపోయింది. టీ20 మాత్రమే కాదు, వన్డే సిరీస్ కూడా కోల్పోయింది.


