Rohit Sharma : సుదీర్ఘకాలం తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. మరి కొద్ది రోజుల్లో పాక్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి రావడం జట్టు వర్గాలను, అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. ఎందుకంటే గత ఏడాది శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ మెరుగైన పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్ లలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆఫ్ సైడ్ బంతులను ఎదుర్కోవడంలో.. తడబడ్డాడు..షార్ట్ పిచ్ బంతుల విషయంలోనూ రోహిత్ ఇలాంటి వైఫల్యాన్నే ప్రదర్శించాడు. దీంతో అతడిని టీమిండియా మేనేజ్మెంట్ సిడ్ని టెస్ట్ కు దూరం పెట్టింది.. ఒకానొక దశలో రోహిత్ మిగతా ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే వాటిని పక్కనపెట్టి రోహిత్.. తాను ఇప్పట్లో క్రికెట్ కు వీడ్కోలు పలకలేనని స్పష్టం చేశాడు. మరి కొంతకాలం క్రికెట్ ఆడతానని ప్రకటించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ లో తొలి వన్డేలో రోహిత్ విఫలమయ్యాడు. అయితే కటక్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో మాత్రం శివతాండవం చేశాడు.. మునుపటి రోహిత్ చర్మను అభిమానులకు పరిచయం చేశాడు.
సచిన్ రికార్డు బ్రేక్
కటక్ లో బ్యాట్ తో శివతాండవం చేసిన రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. 30 సంవత్సరాల వయస్సు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా సెంచరీలు చేసిన భారతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. 30 సంవత్సరాల అనంతరం హిట్ మాన్ ఏకంగా 36 సెంచరీలు కొట్టాడు..ఇదే క్రమంలో సచిన్ టెండూల్కర్ (35) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రావిడ్ (26), విరాట్ కోహ్లీ (19) తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఇంగ్లాండు జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు.. రోహిత్ దూకుడైన బ్యాటింగ్ వల్ల ఇంగ్లాండ్ విధించిన భారీ లక్ష్యాన్ని సైతం టీమిండియా చేదించింది. ఇంగ్లాండ్ విధించిన 305 పరుగుల విజయ లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. నాలుగు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకుంది. సుదీర్ఘకాలం తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేయడం.. అది కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సెంచరీ చేయడంతో రోహిత్ శర్మ ఒకసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీగా కొనసాగుతున్నాడు.