Rohit Sharma Admitted Hospital: టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ ఆస్పత్రి పాలయ్యాడు. ముంబైలోని ధీరుబాయ్ అంబానీ కోకిలబెన్ ఆస్పత్రిలో అతడు చేరినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కొత్తగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రోహిత్ అభిమానులలో ఆందోళన పెరిగిపోయింది. అతడికి ఏమైంది.. ఎందుకు ఆసుపత్రికి వెళుతున్నాడు.. అనే చర్చ అభిమానుల్లో మొదలైంది.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
రోహిత్ శర్మ ఇటీవల సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. గత ఏడాది పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందు నుంచి యాజమాన్యంతో ఆఖరికి అనేక దఫాలుగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఏం మాట్లాడుకున్నారు.. అనే విషయాలపై స్పష్టత లేకపోయినప్పటికీ రోహిత్ మాత్రం రిటైర్మెంట్ వైపు మొగ్గు చూపించాడు. అంతేకాకుండా జట్టు వర్గాలను.. తోటి ప్లేయర్లను ఆశ్చర్యానికి గురిచేస్తూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ లో టీమిండియాకు నాయకత్వం వహిస్తాడని చర్చ జరిగినప్పటికీ.. ఆ టోర్నీ వాయిదా పడిన నేపథ్యంలో రోహిత్ ఇప్పట్లో మైదానంలో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రోహిత్ ఇటీవల వ్యాయామశాలలో తీవ్రంగా కసరత్తులు చేశాడు. తనకు ఇబ్బందిగా మారిన అధిక బరువును తొలగించుకున్నాడు. ఒకప్పుడు పుష్టిగా కనిపించిన అతడు ఇప్పుడు స్లిమ్ గా మారాడు. మారిన రోహిత్ ఆకృతిని చూసి చాలామంది అభిమానులు ఆశ్చర్యపోయారు. హీరోలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేశారు. అయితే అటువంటి రోహిత్ ఇప్పుడు ఆస్పత్రిలో చేరడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అందువల్లేనా
రోహిత్ కొంతకాలంగా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవడానికి వెళ్లినట్టు మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. పగటిపూట వెళితే ఆసుపత్రిలో ఇబ్బంది ఎదురవుతుందని భావించి.. తెల్లవారుజామున పరీక్షల కోసం రోహిత్ వెళ్లినట్టు తెలుస్తోంది. వాస్తవానికి రోహిత్ ఆసుపత్రికి వెళ్తున్న విషయం అత్యంత రహస్యంగా ఉంచినప్పటికీ.. అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రోహిత్ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.