Riyan Parag: నవ్విన నాప చేను పండుతుందని ఒక సామెత.. ఆ సామెత ఇతని జీవితంలో నూటికి నూరుపాళ్ళు నిజం. చిన్న వయసు.. ఉడుకు రక్తం.. క్యాచ్ పట్టినా.. ఫోర్ కొట్టినా.. సిక్స్ బాదినా.. అతడు ఆవేశాన్ని ఆపుకునేవాడు కాదు. మైదానంలో బిగ్గరగా అరిచేవాడు.. లేకుంటే రకరకాల సంకేతాలు చూపించేవాడు.. అది చూసే ప్రేక్షకులకు ఓవర్ యాక్షన్ లాగా కనిపించింది.. పైగా అతని ఆట తీరు కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఓవర్ యాక్షన్ స్టార్ అనే బిరుదు స్థిరపడిపోయింది.. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోల్స్ భరించలేని స్థాయిలో ఉండేవి. వీటన్నింటికీ చెక్ పడాలంటే ముందు అతడు మారాలి.. అతని ఆట తీరు మారాలి.. అదే గట్టిగా అనుకున్నాడు.. మైదానంలో కసరత్తు చేశాడు. దేశవాళి క్రికెట్లో సత్తా చూపించాడు. సీన్ కట్ చేస్తే తన 2.0 ను ఈ ఐపీఎల్ 17వ సీజన్లో ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపిస్తున్నాడు.
22 సంవత్సరాల రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ ల్లో బెంగళూరు మినహా మిగతా అన్నింటిలోనూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.. లక్నోపై 29 బంతుల్లో 43 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ జట్టుపై జరిగిన మ్యాచ్లో 45 బంతుల్లో 84 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ గెలవడంలోనూ పరాగ్ ముఖ్య భూమిక పోషించాడు. ముంబై ఇండియన్స్ పై జరిగిన మ్యాచ్లో 39 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ లోనూ రాజస్థాన్ గెలవడంలో తన వంతు కృషి చేశాడు. గుజరాత్ జట్టుపై బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. కెప్టెన్ సంజూ తో కలిసి 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒక్క బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లోనే రియాన్ పరాగ్ విఫలమయ్యాడు. ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్లో 261 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. 316 పరుగులతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు..
ఇక గత సీజన్లో రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యాడు. 118.18 స్ట్రైక్ రేటుతో కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడాది రాజస్థాన్ జట్టు అతడిని వేలంలో 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ జట్టుకు అవసరమైన స్థాయిలో అతడు బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుతం అద్భుతమైన ఇన్నింగ్స్ తో అలరిస్తున్న అతడిని టీమిండియా టి20 జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. త్వరలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో రియాన్ పరాగ్ కు అవకాశం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అయితే బీసీసీఐ సెలెక్టర్లు అభిమానుల విన్నపాన్ని మన్నిస్తారా?.. రియాన్ పరాగ్ కు అవకాశం కల్పిస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది.