Rishabh Pant Captaincy Exit: ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కార్పొరేట్ కంపెనీలు ఆడే క్రీడ. కార్పొరేట్ కంపెనీలు ఐపీఎల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంటాయి. పెట్టిన పెట్టుబడికి ఎలాగూ రాబట్టుకుంటాయి. కానీ కార్పొరేట్ కంపెనీలు ఆలోచించే విధానం వేరే విధంగా ఉంటుంది. పెట్టిన పెట్టుబడికి రాబడి తో పాటు లాభాలు కూడా ఆశిస్తాయి. మార్కెట్ వ్యాల్యూ పెంచుకోవడానికి తాపత్రయపడుతుంటాయి. అందువల్లే కదా ఆటగాళ్ల మీద కార్పొరేట్ కంపెనీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. పది కోట్లు , 20 కోట్లు ఆటగాళ్లకు కంపెనీలు ఎందుకు చెల్లిస్తున్నాయంటే ఇదిగో ఇందుకే.
ఆటగాళ్లు యాజమాన్యాల అంచనాలను మించి రాణించలేక పోతే.. కోట్లు పొంది సరిగా ఆడ లేకపోతే ఆటగాళ్ల మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారం మొదలవుతుంది. యాజమాన్యాలు పదేపదే ఆ ప్లేయర్లపై ఏదో ఒక విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఆటగాళ్లు తమ ఆట తీరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చుకోకపోతే పక్కకు తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా పక్కకు తప్పుకొని సంచలనంగా మారాడు లక్నో జట్టు సారథి రిషబ్ పంత్.
2024 మెగా వేలంలో లక్నో జట్టు యాజమాన్యం రిషబ్ పంత్ ను 27 కోట్లకు సొంతం చేసుకుంది. నాటి నుంచి లక్నో జట్టుకు అతడు సారధిగా ఉంటున్నాడు. అయితే అతని నాయకత్వంలో లక్నో జట్టు రెండు సీజన్లలో కలిపి కేవలం 10 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. గత సీజన్లో ఆరు విజయాలు సాధించినప్పటికీ ప్లే ఆఫ్ దాకా వెళ్లలేకపోయింది. బ్యాటింగ్ పరంగా కూడా రిషబ్ పంత్ దారుణమైన ఆట తీరు కొనసాగించాడు. ఈ సీజన్లో అయితే అతడు 14 మ్యాచ్లు ఆడి కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది మొత్తంగా అతడు కేవలం 312 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ సీజన్లో రిషబ్ పంత్ నాయకత్వంలో లక్నో జట్టు 14 మ్యాచ్లు ఆడింది. కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో రిషబ్ పంత్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది. మేనేజ్మెంట్ అతని మీద ఒత్తిడి తీసుకొచ్చిందా.. పంత్ కావాలని తప్పుకున్నాడా అనే విషయాల మీద క్లారిటీ లేకపోయినప్పటికీ.. తన కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పించాలని కోరినట్టు లక్నో యాజమాన్యం ట్విట్టర్ వేదికగా పేర్కొంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పంత్ కోరాడని.. దానికి మేనేజ్మెంట్ ఒప్పుకుందని.. అదే కాదు ఈ మార్పు వెంటనే అమలులోకి వస్తుందని లక్నో యాజమాన్యం ప్రకటించింది. సారధిగా లక్నో జట్టుకు పంత్ అద్భుతమైన సేవలు అందించాలని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో జట్టును గొప్పగా నిర్మించడం మీద దృష్టి పెట్టామని లక్నో యాజమాన్యం ప్రకటించింది.
27 కోట్లతో పంత్ ను కొనుగోలు చేసిన తర్వాత లక్నో యాజమాన్యం అతని మీద భారీ అంచనాల పెట్టుకుంది. అయితే వాటిని అందుకోవడంలో అతడు ప్రతిసారి విఫలమవుతూనే ఉన్నాడు. ఈ సీజన్లో కూడా అతడు విఫలం కావడంతో లక్నో యాజమాన్యం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అతడిని తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. చివరికి అవే నిజమయ్యాయి. ఇప్పుడు అతడి స్థానంలో ఎవరు నాయకుడు అవుతాడు.. ఎవరు గోయంకా జట్టును ముందుండి నడిపిస్తారు అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
Official announcement. pic.twitter.com/7WeOwpkDr6
— Lucknow Super Giants (@LucknowIPL) May 29, 2026
