Rishabh Pant :: పుష్ప-2 సినిమా చూశారా.. పోలీసు వాళ్లకు గజ్జలు వణికి పోవాలి అంటాడు అల్లు అర్జున్.. సేమ్ అలానే చేసాడు. ఉన్నంతసేపు తుఫాన్ సృష్టించాడు. సునామీని పరిచయం చేశాడు. గుండెల్లో దడ పెంచాడు. మెదడులో కల్లోలం సృష్టించాడు. దూకుడు అనే పదాన్ని కొత్తగా చెప్పాడు. ధైర్యం అనే పదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చాడు. మొత్తంగా బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోల్పోయినప్పటికీ టీమిండియా కు కొంతలో కొంత బలమైన సాంత్వన ఇచ్చాడు. ఇవన్నీ చేసింది ఒక్కడే.. అతడి పేరే రిషబ్ పంత్. ఓటమితో నిరాశలో ఉన్న సగటు భారత క్రికెట్ అభిమానికి ఎంత కొంత రిలీఫ్ ఇచ్చాడు.
కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు.. రాహుల్ తేలిపోయినప్పుడు.. జైస్వాల్ చేతులెత్తేసినప్పుడు.. గిల్ తన వల్ల కాదన్నప్పుడు.. రిషబ్ పంత్ ఒక్కడిగానే వచ్చాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన ఆటకు ఏ సినిమా మ్యాచ్ అవుతుందో తెలియదు.. ఏ డైరెక్టర్ దాన్ని గొప్పగా తీయగలడో నేను చెప్పలేను. వేల గనుక ఆ సినిమా తీయగలిగితే గుండెను గుప్పెట్లో పట్టుకొని ఆ సినిమాను జనం అంతసేపు చూస్తారు.. అందులో అనుమానం లేదు.. కావాలంటే చూడండి స్టార్క్ మీద పంత్ రివెంజ్ తీర్చుకున్న విధానం న భూతో న భవిష్యతి . తన బాడిని టార్గెట్ చేసి విసిరిన బంతులకు సరైన సమాధానం చెప్పాడు.. క్రికెట్ పిచ్చి ఉన్న వాళ్ళందరికీ తన ఇన్నింగ్స్ తో సమ్మోహితులను చేశాడు. మాదకద్రవ్యాలు కూడా ఇవ్వలేనంత కిక్ ఎక్కించాడు. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.. ఒక రకంగా చెప్పాలంటే తడిపేసాడు.. తను క్రీజ్ లో ఉంటే గజ్జలు వణికి పోతాయని నిరూపించాడు. వికెట్లు పడగొట్టిన బోలాండ్.. బౌలింగ్ లో స్ట్రైట్ సిక్స్ కొట్టాడు.. అది మ్యాచ్ కే హైలెట్.. అందువల్లే కమిన్స్ అప్రమత్తమయ్యాడు.. ఏకంగా బౌండరీ లైన్ వద్ద ఆరుగురిని మోహరింపజేశాడు. అయినప్పటికీ పంత్ తన ఊపుడు. ఆపితే కదా.. వాస్తవానికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అతడికి తగిలిన బంతులను.. ఇంకొక బ్యాటర్ కనుక ఎదుర్కొని ఉంటే.. పరిస్థితి మరో విధంగా ఉండేది. కనీసం అతడు మ్యాచ్ ఆడే వాడు కూడా కాదు..
అందువల్లే ఈ కసి
పంత్ దూకుడుగా ఆడటం వెనుక చాలా కారణాలు ఉండి ఉండవచ్చు. తనను కావాలని కొట్టారని బాధతో పంత్ ఎదురుదాడికి దిగి ఉండవచ్చు. ఏది ఏమైతేనేం.. ఉన్నంతసేపు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు..వెబ్ స్ట ర్ బౌలింగ్లో కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోయింది. స్టార్క్ బౌలింగ్ లో కొట్టిన సిక్సర్లు అభిమానులకు వీనుల విందుగా నిలిచిపోయాయి. దీంతో స్టార్క్ మళ్ళీ బౌలింగ్ వేయలేదు. తన ఎడమ చేతివాటంతో వంగి వంగి బ్యాటింగ్ చేస్తుంటే.. మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే.. పంత్ ఇలా మాత్రమే ఆడాలి అని కోరుకోని సగటు టీమిండియా అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అతడు ఎవరినీ లెక్కచేయడు.. స్టార్క్ నా, బోలాండా.. ఎవడైనా సరే ట్రీట్మెంట్ ఒకే లాగా ఇచ్చేశాడు.. డిఫెన్స్ ఆడమని కొంతమంది కామెంట్రీ బాక్సులో వాగుతుంటారు.. ఇంకొంతమంది డ్రెస్సింగ్ రూమ్ లో బుర్ర తిని ఉంటారు.. కానీ అతడు అలానే ఉంటాడు. టెస్ట్ క్రికెట్లో తుఫాన్ అనే పదానికి నిర్వచనం లాగా ఉంటాడు.. పంత్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. కొత్తగా సెట్ చేయడానికి కూడా ఏమి లేదు.. అది ఉపఖండం మైదానాలయినప్పటికీ.. ఇతర మైదానాలయినప్పటికీ.. బ్యాటింగ్ అలానే ఉంటుంది.
పంత్ డిఫెన్స్ ఆడితే..
పంత్ డిఫెన్స్ ఆడితే ఎప్పుడో ఒకసారి బాగుంటుంది.. కానీ ప్రతిసారి జిడ్డు ఆట ఆడితే చూసే ప్రేక్షకులకు చిరాకు కలిగిస్తుంది. బౌలర్ ఎవరనేది పట్టించుకోడు అచ్చం సెహ్వాగ్ లాగా.. బంతి పడిందా లేదా అనేది మాత్రమే అతడి అసలు సిద్ధాంతం.. వంద బంతులు ఎదుర్కొని 40 కొట్టడం కంటే.. 30 బంతులు ఎదుర్కొని 60 కొట్టడం అతడి అసలు బ్యాటింగ్ సూత్రం.. పంత్ గనక అలా ఆడకపోయి ఉంటే టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో వంద కూడా చేసేది కాదు.. కాకపోతే గిల్ కొంతసేపు నిలబడి ఉంటే బాగుండేది.. మంచి బంతులను ఎదుర్కొన్న అతడు.. కొత్త బంతికి అవుట్ అయ్యాడు.. అన్నట్టు సునీల్ గవాస్కర్ ఆ మధ్య స్టుపిడ్ స్టుపిడ్ అన్నాడు.. దానికి విశ్వరూపం చూపించి సరైన సమాధానం చెప్పాడు. పంత్.. బుమ్రా 30+ కి పైగా వికెట్లు తీయవచ్చు గాక.. యశస్వి జైస్వాల్ 161, 82, 84 పరుగులు చేయవచ్చుగాక.. నితీష్ కుమార్ రెడ్డి తొలి సెంచరీ పూర్తి చేసుకోవచ్చు గాక.. కానీ వాటన్నింటికీ మించి రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్సే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో హైలెట్.. ఈ మాట తప్పు అనే టీమిండియా అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు.
RISHABH PANT APPRECIATION POST #AUSvIND
pic.twitter.com/2GNd6eb7Z5— Aussies Army (@AussiesArmy) January 4, 2025