Rishabh Pant Injured: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో అతడు అదరగొడుతుంటాడు.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు.. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో అతడు ఆడిన ఆటను ఎవరూ మర్చిపోలేరు. సెంచరీల మీద సెంచరీలు కొట్టి పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంగ్లాండ్ సిరీస్లో ఆడుతున్నప్పుడు క్రిస్ ఓక్స్ బౌలింగ్లో అతడు గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. తీవ్రంగా గాయపడిన అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందాడు. ఆ తర్వాత తనను తాను నిరూపించుకోవడానికి సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో రంగంలోకి దిగాడు. అయితే ఇక్కడ కూడా అతనికి అపశృతులు ఎదురయ్యాయి. మూడోరోజు మూడు బంతుల్లో మూడుసార్లు అతడు దెబ్బలు తగిలించుకోవాల్సి వచ్చింది. మొదటి బంతి హెల్మెట్ కు తాకింది. అనంతరం మోచేతికి గాయమైంది. ఆ తర్వాత కడుపులోకి బంతి దూసుకు వచ్చి గాయమైంది.
ఇలా వరుసగా మూడు గాయాలు కావడంతో రిషబ్ పంత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. నొప్పితో విలవిలలాడిపోయాడు. రిషబ్ పంత్ ఇటీవల కాలంలోనే ఇంగ్లాండ్ టూర్ లో గాయపడ్డాడు. చాలా రోజులు చికిత్స పొందాడు. ఆ తర్వాత ఇలా మైదానంలోకి దిగాడు లేదో మళ్లీ గాయపడ్డాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో అతడిని ఎంపిక చేశారు. అతడు గాయపడిన నేపథ్యంలో టెస్ట్ సిరీస్ ఆడతాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.
రిషబ్ పంత్ మాత్రమే కాకుండా జూరెల్ కూడా గాయపడ్డాడు. అతడు ఏకంగా నాలుగు నెలల పాటు క్రికెట్ మొత్తానికి దూరమయ్యాడు. నాలుగు నెలల వరకు అతడు ఎటువంటి క్రికెట్ టోర్నీలు ఆడకూడదని వైద్యులు స్పష్టం చేశారు. ఇటు పంత్, అటు జూరెల్ గాయపడిన నేపథ్యంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నార్ధకంగా మారింది. సౌత్ ఆఫ్రికా తో జరిగే టెస్ట్ సిరీస్ ను భారత జట్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందువల్లే ఈ టోర్నీకి యంగ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. రిషబ్ పంత్ ఎంపిక కూడా అటువంటిదే. అయితే పంత్ గాయపడుతున్న నేపథ్యంలో.. తుది జట్టులో ఉంటాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం త్వరలోనే లభిస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.