RK Kottapaluku: తెలుగులో ఎన్నో పత్రికలు ఉన్నాయి. ఇంకా ఎన్నో న్యూస్ చానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వార్తలను ప్రచురిస్తూనే ఉంటాయి. ప్రసారం చేస్తూనే ఉంటాయి.. వార్తల్లో అధికంగా రాజకీయపరమైన అంశాలు ముడిపడి ఉంటాయి. రాజకీయాల ద్వారానే రాష్ట్ర, దేశంలో పరిపాలన ముందుకు సాగుతూ ఉంటుంది. పరిపాలన సాగిస్తున్న క్రమంలో తీసుకునే నిర్ణయాలు సగటు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే. అలాంటప్పుడు ఈ నిర్ణయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం సగటు మనిషికి ఉంటుంది. అయితే వీటి గురించి స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది. అయితే అన్ని మీడియా సంస్థలు ఇలాంటి బాధ్యతను భుజానికి ఎత్తుకోవు. ఆయా మీడియా సంస్థలకు రాజకీయ అవసరాలు ఉంటాయి కాబట్టి.. వాటి అవసరాలకు తగ్గట్టుగానే వార్తలను ప్రచురిస్తుంటాయి. ప్రసారం చేస్తూ ఉంటాయి.
తెలుగులో ఆంధ్రజ్యోతి ఏబీఎన్ పేపర్, న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న వేమూరి రాధాకృష్ణ మాత్రం ఇందుకు భిన్నం. ఆయన సుప్రసిద్ధ జర్నలిస్ట్.. కొన్ని విషయాలలో కుండ బద్దలు కొట్టినట్టు ఉంటారు. తన పత్రికలో ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయ అంశాల మీద తన విశ్లేషణ చేస్తుంటారు. ఇందులో చంద్రబాబు ప్రస్తావన రాకుంటే ఆర్కే రాసే విషయాలకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ చంద్రబాబు ప్రస్తావన వస్తే మాత్రం అదంతా కీర్తి కండూతీ వ్యవహారం లాగా ఉంటుంది..
ప్రతి ఆదివారం కొత్త పలుకు సంపాదకీయం రాసే రాధాకృష్ణ.. ఈ ఆదివారం గ్యాప్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వ్యవహారం వేడివేడిగా సాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పట్ల చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా సంచలనం కలిగిస్తున్న పరిణామాలు.. వీటి వెనుక ఎటువంటి వ్యవహారాలు సాగుతున్నాయో తెలుసుకోవాలని సగటు పాఠకుడికి ఉంటుంది.. వీటిని అరటి పండు ఒలిచి పెట్టినట్టు చెప్పడం రాధాకృష్ణకు మాత్రమే సాధ్యం. అయితే ఈ ఆదివారం రాధాకృష్ణ కొత్త పలుకు ప్రచురితం కాలేదు.. పైగా తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రాధాకృష్ణ ఇల్లు ఉంది. ఆయన కూడా ఉప ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది.. ఇంతటి పరిణామాలు జరుగుతుంటే రాధా కృష్ణ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? గ్యాప్ వచ్చిందా? కావాలని తీసుకున్నారా? ఏది ఏమైనాపటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి వేడివేడి పరిణామాలు జరుగుతుంటే.. రాధాకృష్ణ ఏమీ పట్టనట్టుగా ఉండడం పట్ల ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.