India Vs England Semi Final 2024: టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం వెస్టిండీస్ లోని గయానా వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 171 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 57, సూర్య కుమార్ యాదవ్ 47, హార్దిక్ పాండ్యా 23, రవీంద్ర జడేజా 17 పరుగులు చేశారు.. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది..బ్రూక్ 25, బట్లర్ 23 పరుగులతో టాప్ స్కోరర్ లు గా నిలిచారు. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
పలుమార్లు వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణకు అంతరాయం ఏర్పడింది. రిజర్వ్ డే లేకపోవడంతో అంపైర్లు ఆలస్యమైనా సరే మ్యాచ్ నిర్వహణకే మొగ్గు చూపించారు.. అయితే వర్షం కురిసిన నేపథ్యంలో.. మైదానంపై ఉన్న కాస్త తేమను భారత స్పిన్నర్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. పవర్ ప్లే లో కీలక వికెట్లు పడగొట్టి.. మ్యాచ్ పై పట్టు సాధించారు. ఇంగ్లాండ్ జట్టు లో కీలకమైన ఆరు వికెట్లను అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్ దక్కించుకున్నారంటే.. వారి బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో మొయిన్ అలీ వికెట్ కోల్పోయిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది.
అప్పటికే ఇంగ్లాండ్ జట్టు ఫిలిప్ సాల్ట్, బట్లర్, జానీ బెయిర్ స్టో వికెట్లను కోల్పోయింది. అప్పటికి ఆ జట్టు స్కోర్ 7 ఓవర్లు పూర్తయ్యే సరికి 46 పరుగులు.. క్రీజ్ లో మొయిన్ అలీ, సామ్ కరణ్ ఉన్నారు. ఈ దశలో బంతిని అక్షర్ పటేల్ అందుకున్నాడు. స్ట్రైకర్ గా మొయిన్ అలీ ఉన్నాడు. అప్పటికే అతడు తొమ్మిది బంతులు ఎదుర్కొని ఎనిమిది పరుగులు చేశాడు. ఈ దశలో అక్షర్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి ముందుకు వచ్చాడు. అది కాస్త అతడి ప్యాడ్ కు తగిలింది. క్రికెట్ల వెనుక ఉన్న రిషబ్ పంత్ ఒక్క ఉదుటున ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి.. బంతితో స్టంప్స్ ను గిరాటేశాడు. అలీ బ్యాట్ క్రీజ్ లో పెట్టేలోపే.. చేయాల్సిన నష్టం చేసేసాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ వేగంగా వచ్చి స్టంప్ ను గిరాటేయడంతో బిత్తరపోవడం మొయిన్ అలీ వంతయింది.. ఈ వీడియోను ఐసీసీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.