Ind Vs Aus 5th Test: గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చిన నాటి నుంచి మిశ్రమ ఫలితాలు లభించాయి. శ్రీలంకతో టి20 సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. 30+ సంవత్సరాల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది. తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమ్ ఇండియా గెలిచింది. అదే ఊపులో టి20 సిరీస్ కూడా గెలిచింది. కానీ ఎప్పుడైతే న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడిందో.. అప్పటినుంచి టీమ్ ఇండియాకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఈ సిరీస్లో టీమ్ ఇండియా తొలిసారిగా స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా తో జరిగిన టి20 సిరీస్ ని గెలిచింది. అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిపోయింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత్ గెలిచింది. ఆ తర్వాత అడిలైడ్ టెస్టులో ఓటమిపాలైంది. బ్రిస్ బేన్ టెస్టును డ్రాతో సరిపెట్టుకుంది. మెల్ బోర్న్ టెస్టులోనూ ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో టీమ్ ఇండియా పై విమర్శలు పెరగడం మొదలైంది. ఒత్తిడి ఎక్కువ కావడం ప్రారంభమైంది. జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో చివరిదైన ఐదో టెస్టుకు రోహిత్ శర్మను పక్కన పెట్టి.. బుమ్రా కు జట్టు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. పెర్త్ టెస్టులో బుమ్రా నాయకత్వంలోనే టీమ్ ఇండియా గెలిచింది. దీంతో అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేనేజ్మెంట్ భావించి.. అతడికి అవకాశం ఇచ్చింది.
గౌతమ్ గంభీర్ వల్లే రోహిత్ శర్మ ను కెప్టెన్ గా పక్కన పెట్టారని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో “RIP Gautam Gambhir” అనే యాష్ ట్యాగ్ ను నిన్నటి నుంచి ట్రెండ్ చేస్తున్నారు. 2021 నుంచి టెస్టులలో టీమిండియా తరఫున అదే విధంగా పరుగులు చేసింది రోహిత్ శర్మ మాత్రమేనని.. అతడు సాధించిన రికార్డులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఇలా ఏకపక్షంగా పక్కన పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాతే టీమిండియా కు వరుస ఓటములు మొదలయ్యాయని.. ఇలా రోహిత్ శర్మను పక్కన పెట్టడం అత్యంత దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.. గౌతమ్ గంభీర్ తన వ్యవహార శైలిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సోషల్ మీడియాలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ” రోహిత్ సమర్థవంతమైన ఆటగాడు. అంతకుమించి గొప్ప లక్షణాలు ఉన్న కెప్టెన్. అతడికి ఆట తీరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. అందు గురించే అతడిని హిట్ మాన్ అని పిలుస్తారు. ఈ విషయం గౌతమ్ గంభీర్ మర్చిపోయినట్టున్నాడు. అందువల్లే వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని ఇబ్బంది పెడుతున్నాడు. ఇది సరైన పద్ధతి కాదు. గౌతమ్ గంభీర్ తన విధానాన్ని మార్చుకోవాలని” రోహిత్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.