Tirumala: వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 10 నుంచి 19 వరకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది టిటిడి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలో పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో, జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, సి వి ఎస్ శ్రీధర్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని నిర్ణయించారు. జనవరి 10 నుంచి మూడు రోజులపాటు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఆ మూడు రోజులపాటు పటిష్టమైన ఏర్పాట్లు ఉండాలని ప్రణాళికలు రూపొందించారు. దర్శనానికి వచ్చే వీఐపీలు, వారికి అందించిన పాసులు, దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతాలు, ఇన్,అవుట్ గేట్ల వివరాలు పొందుపరిచారు.
* కేటాయించిన సమయానికే దర్శనం
ఇప్పటికే ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్లు జారీ చేశారు. ఆన్లైన్లో జారీ ప్రక్రియకు విశేష స్పందన లభించింది. మరోవైపు ఆఫ్లైన్లో సైతం టోకెన్లు జారీ చేయనున్నారు. వీఐపీలతోపాటు సాధారణ భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ పాదరక్షాలను గదులతో పాటు వాహనాల్లో వదిలి రావాలని సూచిస్తున్నారు టీటీడీ సిబ్బంది. భక్తుల రద్దీ నేపథ్యంలో తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా శుభ్రతను పాటించాలని, వ్యర్ధాలను టీటీడీ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలని అదనపు ఈవో వీరబ్రహ్మం కోరారు.
* భద్రతా చర్యలు
మరోవైపు వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు ఎస్పి సుబ్బారాయుడు తెలిపారు. తిరుమలలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించనున్న ట్లు తెలిపారు. తిరుపతిలోని ఎస్ ఎస్ డి కౌంటర్ల వద్ద, ఫుట్ పాత్ మార్గంలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు జిల్లా ఎస్పీ. ఇంకోవైపు ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి ఆఫ్ లైన్ టికెట్ల జారీ ప్రక్రియపై కూడా సమీక్షించారు. తిరుమల తో పాటు తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఈనెల తొమ్మిది నుంచి ఈ కౌంటర్లలో టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.