Nagababu: జగన్ ను పులకేశితో పోల్చిన నాగబాబు.. వీడియో వైరల్

నాగబాబు వాయిస్ ఓవర్ తో కూడిన ఈ వీడియో ఇప్పుడు తెలుగు నాట ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది. ఒకసారి ఆ వీడియోను పరిశీలిస్తే.. " చిన్నప్పుడు స్కూల్లో ఓ నీతి కథ చెప్పేవారు.

Written By: Dharma, Updated On : April 12, 2024 11:37 am

Nagababu

Follow us on

Nagababu: ఏపీలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రత్యర్థులపై బలం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన సీనియర్ నేత, మెగా బ్రదర్ నాగబాబు ‘పొలాలను దోచేసే పులివెందుల పులకేశి’ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైయస్ జగన్ ట్యాగ్ చేస్తూ చేసిన వీడియో తెగ ఆకట్టుకుంటోంది.

నాగబాబు వాయిస్ ఓవర్ తో కూడిన ఈ వీడియో ఇప్పుడు తెలుగు నాట ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది. ఒకసారి ఆ వీడియోను పరిశీలిస్తే.. ” చిన్నప్పుడు స్కూల్లో ఓ నీతి కథ చెప్పేవారు. ఓ పిల్లాడు పక్కింట్లో ఉన్న తోటకూర కాడలు దొంగతనం చేసి తెచ్చాడు. దానికి ఆ తల్లి అతడిని కొట్టకుండా తోటకూర పులుసు చేసి వడ్డించింది. పిల్లాడు పెద్దయ్యాక గజదొంగ అయ్యాడు. అతని రాజభటులు శిక్షిస్తే… అమ్మ తోటకూర నాడైనా చెప్పకపోతివా అని ఏడ్చాడు. నేను చెప్పే కథకు, ఈ నీతి కథకు ఉన్న లింక్ ఏంటో తర్వాత చెప్తాను” అని కదపట్ల నాగబాబు మరింత ఉత్కంఠ పెంచారు.

” హైదరాబాదులోని శివ శివాని స్కూల్లో పదో తరగతి పరీక్ష పేపర్లు దొంగలించారు. దాని వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తేల్చారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు కావడంతో మేనేజ్ చేశారు. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గుర్తు చేశారు. నాడు పరీక్ష పేపర్ల దొంగలకు మాస్టర్ మైండ్ గా ఉన్న జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక మనం ఆస్తులను దోచుకోవడానికి స్కెచ్ లు వేశాడు. అందుకు తన కావాల్సిన విధంగా చట్టాలు రాసుకుంటున్నాడు. వ్యవసాయ భూములు మీ పేరు మీద ఉన్నవి తెల్లారేసరికి ఎవరి పేరు మీద మారిపోతాయో తెలియదు. మీ పొలం ఎక్కడో పులివెందుల పేటలో ఉన్న వారికో, తాడేపల్లి కోటలో ఉన్న మనుషులకు మారిపోతాయి” అంటూ హెచ్చరికలతో నాగబాబు వార్నింగ్ ఇచ్చారు.

అయితే నాగబాబు ఏపీ ల్యాండింగ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చట్టం ద్వారా రైతులకు, రైతుల భూములకు రక్షణ లేదని న్యాయవాదులు నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే భూ వివాదాలు లేకుండా ఉంటే.. న్యాయవాదులకు కేసులు రావని భావించి నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ వారిపై ఒక అపవాదు వేశారు. కానీ ఈ యాక్ట్ ద్వారా పేదల భూములను వైసిపి అల్లరి మూకలు లాక్కుంటున్నాయని ఆరోపించారు. ఆనాడే తోటకూర దొంగకు తల్లి అప్పుడే శిక్ష వేసి ఉంటే.. అతడు దొంగ అయ్యేవాడు కాదని.. అప్పుడెప్పుడో టెన్త్ పరీక్ష పేపర్లను దొంగిలించిన నాడే జగన్ కు శిక్ష వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. పేదల భూములకు రక్షణ ఉండేదని గుర్తు చేస్తూ నాగబాబు ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోను టిడిపి జనసేన శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. వైసీపీ శ్రేణులు మాత్రం నాగబాబు పై మండిపడుతున్నాయి.