RCB IPL 2025 Final : ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ వెళ్లి ఒక్కసారి కూడా కప్ సాధించలేని జట్టుగా బెంగళూరు జట్టు మీద అపఖ్యాతి ఉంది. 2025 కంటే ముందు బెంగళూరు 2009, 2011, 2016 సందర్భాలలో కూడా చివరి దశ దాకా వెళ్ళింది. కానీ ట్రోఫీకి ఒక అడుగు దూరంలో నిలిచిపోయింది. ప్రతి సందర్భంలోనూ కప్ గెలుస్తుందని అభిమానులు ఆశపడటం.. కీలక మ్యాచ్లో ఆటగాళ్లు చేతులెత్తేయడంతో బాధపడటం పరిపాటిగా మారింది. ఐపీఎల్ మొదలైన 2008లో బెంగళూరు పర్వాలేదనే స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. 2009లో మాత్రం ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ లో నాటి దక్కన్ చార్జర్స్ హైదరాబాద్ తో పోటీ పడింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్ల కంటే బెంగళూరు ప్లేయర్లే సూపర్ ఫామ్ లో ఉన్నారు. కానీ నాటి మ్యాచ్ లో బెంగళూరు తడబడింది. హైదరాబాద్ నిర్దేశించిన 144 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించడంలో బెంగళూరు ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది. మొత్తంగా తొలిసారి ఫైనల్ మ్యాచ్లో భంగపడింది.
సరిగ్గా రెండు సంవత్సరాలకు అంటే 2011 ఐపీఎల్ సీజన్లో కన్నడ జట్టు చివరి దశ పోటీలకు వెళ్ళింది. చెన్నై వేదికగా జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 206 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన బెంగళూరు 147 పరుగుల వద్ద ఆగిపోయింది. తద్వారా రెండవసారి కూడా ఓటమిని మూటగట్టుకుంది. ఫైనల్ దాకా వెళ్లి.. కప్ సాధించలేని అపప్రదను సొంతం చేసుకుంది.. అత్యంత దురదృష్టకరమైన జట్టుగా పేరుపొందింది.
Also Read : 9 సంవత్సరాల తర్వాత ఫైనల్ లోకి.. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుదే.. ఎలాగంటే
సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత అంటే 2016 ఐపీఎల్ సీజన్లో బెంగళూరు ఫైనల్ వెళ్ళింది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తో కప్ కోసం బెంగళూరు తలపడాల్సి వచ్చింది.. అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 208 పరుగులు చేసింది.. ఈ లక్ష్యాన్ని సాధించడంలో రంగంలోకి దిగిన బెంగళూరు చివరి వరకు పోరాడినప్పటికీ 200 పరుగుల వద్ద ఆగిపోయింది.. తద్వారా ముచ్చటగా మూడోసారి ఫైనల్ ఓటమిని మూటకట్టుకుంది.. అత్యంత దురదృష్టకరమైన జట్టుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సరిగ్గా 90 సంవత్సరాలు అనంతరం బెంగళూరు ఫైనల్ వెళ్ళింది. ఈసారి కూడా దుర్భేద్యంగా జట్టు కనిపిస్తోంది. భీకరమైన ప్లేయర్లు ఉన్నారు. అదే స్థాయిలో సత్తా చూపించే బౌలర్లు ఉన్నారు. ఇక ఫీల్డర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యంత బలమైన మద్దతు ఉన్న అభిమాన గణం ఉంది. మరి ఈసారైనా బెంగళూరు కప్ సాధిస్తుందా? గత మూడు పర్యాయాలు ఎదురైన ఓటములకు బదులు తీర్చుకుంటుందా? ఈ ప్రశ్నలకు జూన్ 3న సమాధానం లభించనుంది.