PBKS vs RCB : సాధారణంగానే బెంగళూరు అభిమానులు ఒక రేంజ్ లో ఉంటారు. ఇంతవరకు ఒక్కసారి కూడా ట్రోఫీ కూడా సాధించలేకపోయినప్పటికీ తమ జట్టును శిఖరాగ్రాన నిలుపుతారు. వారి అభిమానమే బెంగళూరు జట్టును ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉంచుతోంది. వాస్తవానికి బెంగళూరు స్థానంలో ఇంకేదైనా జట్టు ఉంటే ఈపాటికి ఐపీఎల్ లో చివరి స్థానంలో ఉండేది. లేదా అనామక జట్టుగా మిగిలిపోయేది. కానీ ఎప్పటికప్పుడు జట్టు ఆటగాళ్లకు.. జట్టు యాజమాన్యానికి అభిమానులు సరికొత్త శక్తిని ఇస్తున్నారు. ఇది మా జట్టు.. మీరు మా ప్లేయర్లు.. ఇది మా గడ్డ అనే నినాదంతో వారు బెంగళూరు ను ఆకాశం అంచులో నిలబెడుతున్నారు. అందువల్లే ఇన్ స్టా గ్రామ్ లో బెంగళూరు జట్టు అధికారిక ఖాతాను 20 మిలియన్ ఫాలోవర్స్ మార్కును అందుకునేలా చేశారు. వాస్తవానికి ఈ జాబితాలో చెన్నై ఉంటే.. ఆ జట్టును క్రాస్ చేసి పడేశారు. చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయినప్పటికీ.. బెంగళూరు అభిమానుల అభిమానం ముందు తలవంచక తప్పలేదు. అయితే ఇప్పుడు అభిమానుల అంచనాలను నిజం చేస్తూ బెంగళూరు ప్లేయర్లు సరికొత్త ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ప్రారంభం నుంచి సెమీఫైనల్ లో గెలిచే వరకు.. ప్రతి మ్యాచ్లో కూడా నూటికి నూరు శాతం ఎఫర్ట్ ప్రదర్శించారు. మధ్యలో కాస్త వెనుకబడినప్పటికీ.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా ఆట తీరు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత బెంగళూరు ఫైనల్ లోకి వెళ్ళింది. బెంగళూరు ఫైనల్ లోకి వెళ్లడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు అంటూ లేకుండా పోయాయి. అయితే ఫైనల్ చేరుకోవడం మాత్రమే కాదు.. ఈసారి కచ్చితంగా ట్రోఫీ కూడా గెలుస్తామని బెంగళూరు అభిమానులు చెబుతున్నారు. “ప్రస్తుతం జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్లో తిరుగులేదు. బౌలింగ్లో ఎదురనేది లేదు. ఇక ఫీల్డింగ్ లో పోటీ జట్టు లేదు. ఇక గత ఏడు సీజన్లలో క్వాలిఫైయర్ -1 లో విజయం సాధించిన జట్టే కప్పు కొడుతోంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈసారి మా జట్టు విజయం సాధిస్తుంది. టైటిల్ అందుకుంటుందని” బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసాలా కప్ నమదే అంటూ నినాదాలు చేస్తున్నారు. బెంగళూరు అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. పోస్టుల పరంపర అంతకుమించి అన్నట్టుగా సాగుతోంది. ట్విట్టర్లో అయితే టాప్ మూడు యాష్ ట్యాగ్స్ బెంగళూరు జట్టు విజయానికి సంబంధించినవే కావడం విశేషం.