India Vs England: ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా భారత్ 2_1 తేడాతో ముందంజ వేసింది. 434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించి.. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. భారత జట్టు విజయంలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు.. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించడమే కాకుండా.. రెండవ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టు పతనాన్ని శాసించాడు. అయితే ఇలా భారత జట్టులో ఐదు వికెట్లు తీసి, సెంచరీ సాధించిన ఆల్ రౌండర్ లు ఎంతోమంది ఉన్నారు. ఒకసారి వారి జాబితా పరిశీలిస్తే..
1952లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వినూ మన్కడ్ 184 పరుగులు చేసి, ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు వినూ మన్కడ్ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు.
1962లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ పాలి ఉమ్రి గర్ 172 పరుగులు చేసి, ఐదు వికెట్లు తీశాడు. ఇప్పటివరకు ఇతడిదే రెండవ అతిపెద్ద ఘనతగా ఉంది.
2011లో ముంబై వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 103 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్లో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2016లో నార్త్ సౌండ్ వేదికగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 113 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు.
చెన్నై వేదికగా 2021లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ 106 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు తీశాడు. సొంత మైదానంలో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
2022లో మొహాలీ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 175 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఐదు వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించాడు.
రాజ్ కోట్ వేదికగా 2024 లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి భారత జట్టు కష్టాల్లో పడినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ చేయడమే కాకుండా.. రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన ఐదుగురు కీలక ఆటగాళ్లను అవుట్ చేసి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.. ఈ విజయం భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్దది కావడం విశేషం.