Ravindra Jadeja: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కుటుంబంలో ఏర్పడిన విభేదాలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. రివాబా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రవీంద్ర జడేజా.. తన తండ్రి అనిరుధ్ సింహ్ జడేజా నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు..” రవీంద్ర జడేజా రివాబాను పెళ్లి చేసుకున్న తర్వాత మూడు నెలల వరకు మాతో కలిసి ఉన్నాడు. తర్వాత భార్య చెప్పిన మాటలు విని మాపై కోపం పెంచుకున్నాడు. ఆ తర్వాత వేరే కాపురం పెట్టాడు. ఆమె ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కనీసం మమ్మల్ని పిలవలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కనీసం పట్టించుకోలేదు. ప్రస్తుతం మాతో మాటలు కూడా మాట్లాడటం లేదు” అని అనిరుధ్ సింహ్ జడేజా ఆరోపించాడు. అయితే అనిరుధ్ సింహ్ జడేజా చేసిన ఆరోపణలను గుజరాత్ రాష్ట్రానికి చెందిన మీడియా, జాతీయ మీడియా అధిక ప్రాధాన్యమించింది. జాతీయ న్యూస్ ఛానల్స్ అనిరుధ్ సింహ్ జడేజా చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రస్తావించాయి..
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రవీంద్ర జడేజా స్పందించక తప్పలేదు..తన తండ్రి అనిరుధ్ సింహ్ జడేజా చేసిన వ్యాఖ్యలను రవీంద్ర కొట్టిపారేశాడు. “నా తండ్రి కట్టు కథలు చెబుతున్నాడు. నా భార్యపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాడు. ఆమె గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాడు. వివిధ పత్రికల్లో ప్రచురితమైన ఆరోపణలన్నీ సత్యదూరం. నా భార్య వ్యక్తిత్వాన్ని కించపరచడాన్ని నేను ఏమాత్రం సహించను. నేను కూడా చాలా విషయాలు వెల్లడించగలను. కానీ ఇది సరైన సమయం కాదు” అని రవీంద్ర జడేజా సోషల్ మీడియాలో వ్యాఖ్యానించాడు.
అటు అనిరుధ్ సింహ్ జడేజా, ఇటు రవీంద్ర జడేజా ఆరోపణల నేపథ్యంలో స్థానిక మీడియా,జాతీయ మీడియా ఈ కథనాలకు ప్రముఖంగా ప్రాధాన్యమిస్తున్నది. బ్రేకింగ్ న్యూస్ ల వేస్తూ హంగామా చేస్తున్నది. అయితే మీడియా తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.. రవీంద్ర జడేజా కుటుంబంలో తలెత్తిన వివాదాలను మీడియా భూతద్దం పెట్టి చూపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. అందరి ఇంట్లోనూ ఇలాంటి గొడవలు ఉన్నాయని.. అలాంటప్పుడు మీడియా వాటిపై ఫోకస్ చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. రవీంద్ర జడేజా సెలబ్రిటీ అయినంత మాత్రాన ఆయన వ్యక్తిగత జీవితంలో తొంగి చూడాల్సిన అవసరం లేదని హితవు పలుకుతున్నారు.