LSG vs CSK : కొంపముంచిన వరుణుడు.. కీలక మ్యాచ్ రద్దు..!

మ్యాచ్ ప్రారంభానికి ముందు.. ప్రారంభమైన తర్వాత పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ బ్రేక్ ఇవ్వకపోవడంతో ఎంపైర్లు రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.

Written By: NARESH, Updated On : May 3, 2023 9:50 pm
Follow us on

LSG vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో వర్షం కారణంగా తొలిసారి ఒక మ్యాచ్ రద్దు అయింది. దీంతో ఈ సీజన్ లో వరుణ దేవుడు ఖాతా తెలిసినట్టు అయింది. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో ఎంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు. వర్షం వల్ల అర్థగంట ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. హోరా హోరీగా మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ ఏడాది అన్ని జట్లు అద్భుతంగా ఆడుతుండడంతో తదుపరి దశకు ఏ జట్లు వెళతాయి అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లను పరిశీలిస్తే.. మిగిలిన మ్యాచ్ లు అన్ని జట్లకు అత్యంత కీలకంగా మారాయి. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు బుధవారం నాటి మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. పిచ్ చాలా నెమ్మదిగా ఉండడంతో బ్యాటింగ్ కష్టమైంది. దీంతో 44 పరుగులకే లక్నో జట్టు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. ఈ దశలో ఆయుష్ బదోని 33 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నికోలస్ పూరన్ తో కలిసి ఆరో వికెట్ కు 59 పరుగులు జోడించాడు. దీంతో వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి లక్నో జట్టు 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ, మహీశ్ తీక్షణ, మతీష పతిరణ రెండేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టాడు.

పలుమార్లు అంతరాయం కలిగించిన వర్షం..

మ్యాచ్ ప్రారంభానికి ముందు.. ప్రారంభమైన తర్వాత పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ బ్రేక్ ఇవ్వకపోవడంతో ఎంపైర్లు రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. సాధ్యమైతే 5 ఓవర్ల ఆట ఆడించేందుకు సిద్ధమైనప్పటికీ వరుణుడు కరుణించలేదు. మ్యాచ్ రద్దు వల్ల చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పటిష్టమైన బ్యాటింగ్ లేనప్ ఉన్న చెన్నై జట్టు 130 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేదించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ఇరుజట్ల ప్లే ఆప్స్ అవకాశాలను దెబ్బతీయనుంది. ఇప్పటి వరకు పది మ్యాచులు ఆడిన ఇరు జట్లు ఐదేసి విజయాలతో పాయింట్ల టేబుల్ లో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లే ఆప్స్ చేరాలంటే చివరి 4 మ్యాచ్ ల్లో కనీసం రెండు మ్యాచ్ ల్లో గెలవాల్సిన పరిస్థితి ఈ రెండు జట్లకు ఏర్పడింది. తాజా మ్యాచ్ తరువాత లక్నో జట్టు 10 మ్యాచ్ ల్లో 11 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, చెన్నై జట్టు పది మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో 11 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.