Rajasthan Royals Rahul Dravid : రాజస్థాన్ రాయల్స్ జట్టు కోచ్ నుంచి రాహుల్ ద్రావిడ్ వెళ్లిపోయాడు. జట్టు యాజమాన్యం అదనపు బాధ్యతలు అప్పగించాలని చూస్తే.. ఆ ప్రతిపాదనను ద్రావిడ్ నిరాకరించాడు. దీంతో జట్టు నుంచి అతడు తప్పుకున్నాడు. ద్రావిడ్ నేతృత్వంలో ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో 14 మ్యాచ్లలో కేవలం నాలుగింట్లో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.. ఐపీఎల్ ముగిసిన నేపథ్యంలో ద్రావిడ్ జూలై నెలలో సీజన్ సమీక్ష కోసం లండన్ వెళ్లాడు. అక్కడ యాజమాన్యంతో చర్చలు జరిగాయి. అయితే అదనపు బాధ్యతలను స్వీకరించడానికి ద్రావిడ్ సిద్ధంగా లేకపోవడంతో.. బయటికి వెళ్లిపోవడమే మంచిదని అనుకున్నాడు. ఆ నిర్ణయాన్ని చెప్పడంతో మేనేజ్మెంట్ కూడా సుముఖత వ్యక్తం చేసింది.
తదుపరి అతడేనా
ద్రావిడ్ కోచ్ బాధ్యత నుంచి తప్పుకున్న నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరిని నియమిస్తారనే విషయంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మేనేజ్మెంట్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టుకు డైరెక్టర్ గా ఉన్న కుమార సంగక్కర ద్రావిడ్ స్థానంలో చేరిపోవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు స్పష్టత లేదని తెలుస్తోంది. మనోజ్ బదాలే రాబోయే కొద్ది రోజుల్లో లండన్ లోనే ఉండి.. రాజస్థాన్ జట్టుకు సంబంధించిన సహాయక సిబ్బందితో సమావేశమవుతారని తెలుస్తోంది. అక్కడ కుమార సంగక్కర ను అధికారికంగా రాజస్థాన్ జట్టు కోచ్ గా ప్రకటిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇంతవరకు శ్రీలంక మాజీ ఆటగాడిని లండన్ ఆహ్వానించలేదని సమాచారం..
లండన్లో జరిగే సమావేశానికి భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ హాజరై అవకాశము ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి విక్రం రాజస్థాన్ జట్టుతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒకవేళ కుమార సంగక్కర రాజస్థాన్ జట్టు కోచ్ గా బాధ్యతలు స్వీకరిస్తే.. విక్రమ్ సహాయక శిక్షకుడి బాధ్యతను స్వీకరించే అవకాశం కనిపిస్తోంది. ద్రావిడ్ లేడు కాబట్టి సంజు శాంసన్ రాజస్థాన్ జట్టు నాయకుడిగా కొనసాగుతాడా? లేదా? అనే ప్రశ్నకు కూడా సమాధానం లభించాల్సి ఉంది. ఇటీవల సంజు నాయకత్వంపై అనేక వార్తలు వినిపించాయి. అయితే దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. జట్టును వదిలి వెళ్ళేది లేదని స్పష్టం చేశాడు. అయితే ద్రావిడ్ రాజస్థాన్ జట్టు నుంచి వెళ్లిపోయిన తర్వాత చాలావరకు జట్లు అతడికి ఆఫర్లు ఇస్తున్నాయని.. ఇంతవరకు ఎటువైపు ప్రయాణించాలనే విషయంపై ద్రావిడ్ నిర్ణయించుకోలేదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.