Nara Lokesh: నారా లోకేష్( Nara Lokesh).. పరిచయం అక్కర్లేని పేరు అది. చంద్రబాబు కుమారుడిగా సుపరిచితం. అయితే అదే ఆయనకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబును విభేదించేవారు, ఆయన రాజకీయ ప్రత్యర్థులు, రాజకీయ శత్రువులకు లోకేష్ టార్గెట్ అయ్యారు. వ్యక్తిత్వ హననానికి బాధితుడిగా మారారు. అయితే ఒక విధంగా ఆ బాధలను తట్టుకొని తనను తాను ఆవిష్కరించుకున్నారు లోకేష్. ఇప్పుడు దేశంలోనే యువనేతల్లో ఒకరిగా లోకేష్ గుర్తించబడుతున్నారు. ఆయన ఇప్పుడు ఢిల్లీ వెళుతుంటే మీడియా ఫోకస్ అంతా అతడి పైనే. పార్టీలకు అతీతంగా యువ నేతలు లోకేష్ ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక్క రాజకీయాలకే పరిమితం కావడం లేదు. దేశానికి సంబంధించిన పలు అంశాలపై లోకేష్ మేధోమధనం చేస్తుండడం విశేషం. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న నారా లోకేష్ తో తేజస్వి సూర్య సహా అనేకమంది యువ ఎంపీలు భేటీ కావడం గుర్తించాల్సిన విషయం. అయితే ఆ విషయాన్ని నారా లోకేష్ వెల్లడించలేదు. తమ సమావేశం గురించి తేజస్వి సూర్యనే చెప్పారు.
* క్రేజీ నాయకుడిగా..
జాతీయస్థాయిలో యువ నేతల్లో ఎక్కువగా క్రేజీ ఉన్న నాయకుడిగా లోకేష్ మారారు. తమిళనాడు( Tamila Nadu ) నుంచి బీహార్ వరకు మిత్రపక్షాల తరుపున ప్రచారానికి ఆయన వెళ్తున్నారు. బిజెపి పెద్దలు సైతం అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. జాతీయ స్థాయిలో పెరుగుతున్న నారా లోకేష్ ఇమేజ్ పై బలమైన చర్చ కూడా నడుస్తోంది. లోకేష్ కేవలం ఢిల్లీ పర్యటనలు రాజకీయాల కోసమే కాదు. దేశ భవిష్యత్ పై చర్చించేందుకు కూడా అన్నట్టు ఉంది పరిస్థితి. పార్టీల సరిహద్దుల దాటి యువ ఎంపీలతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు. టెక్నాలజీతో పాటు అడ్మినిస్ట్రేషన్ పై కూడా ఆయనకు మంచి పట్టు ఉంది. స్టాన్ ఫోర్ట్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదువుకున్న అనుభవం ఇప్పుడు అక్కరకు వస్తోంది. ఏపీ మంత్రిగా ఆయన సాధించిన ఫలితాలు జాతీయస్థాయిలో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. కేవలం రాజకీయ విమర్శలకి పరిమితం కాకుండా.. పారిశ్రామిక అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనా వంటి అంశాలపై ఆయన చేసే విశ్లేషణలు ఇతర రాష్ట్రాల యువ నేతలను సైతం ఆకట్టుకుంటున్నాయి.
* వాస్తవాలకు దగ్గరగా..
రాజకీయంగా స్థాయి పెరిగింది.. ఒక రాజకీయ పార్టీకి భవిష్యత్ నాయకుడు. ఆపై ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల సామర్థ్యం సొంతం చేసుకున్నారు. కానీ ఎక్కడ అతిశయోక్తులకు పోలేదు. వాస్తవాలకు దగ్గరగా ఉంటూ అభివృద్ధి గురించి మాట్లాడే ఆయన శైలికి.. జాతీయస్థాయి నేతలు కూడా ఫిదా అవుతున్నారు. నిన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీకి లోకేష్ వారసుడు. కానీ ఇప్పుడు దేశవ్యాప్త యువనేతల్లో ఒక ముఖ్యమైన శక్తిగా ఎదుగుతున్నారు నారా లోకేష్. తన తండ్రి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో పోషించిన పాత్ర.. మరోసారి లోకేష్ కు వెతుక్కుంటూ వస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు కాలం వేరు. ఇప్పటి రాజకీయాలు వేరు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా.. ఆధునిక ఆలోచనలతో లోకేష్ సాగిస్తున్న ప్రయాణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. జాతీయస్థాయిలో లోకేష్ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోంది.