https://oktelugu.com/

Rahul Dravid: అతడు ఫోన్ చేశాడు.. గొప్ప చరిత్రలో భాగమయ్యే అవకాశం దక్కింది.. రాహుల్ ద్రావిడ్ భావోద్వేగం

గత ఏడాది నవంబర్లో స్వదేశం వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమి నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 3, 2024 / 08:42 AM IST

    Rahul Dravid

    Follow us on

    Rahul Dravid: పోగొట్టుకున్న చోట వెతుక్కోవడం అంత సులభం కాదు. కానీ దాన్ని నిజం చేసి చూపించాడు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్. తన సుదీర్ఘ కెరియర్లో వన్డే వరల్డ్ కప్ విజయంలో భాగస్వామిని కాలేక పోయాననే బాధ రాహుల్ ద్రావిడ్ లో ఉండేది. 2003లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత 2007లో ద్రావిడ్ నాయకత్వంలో టీమిండియా వెస్టిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ఆడింది.. దిగ్గజ ఆటగాళ్లు ఉన్నప్పటికీ తొలి రౌండ్ లోనే ఇంటికి వచ్చేసింది. దీంతో టీమ్ ఇండియా పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా రాహుల్ ద్రావిడ్ తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పేసాడు.

    తర్వాత 14 సంవత్సరాలకు టీమిండియా కోచ్ గా వచ్చేసాడు. తన అనుభవంతో టీమిండియాను మెరుగైన జట్టుగా మార్చాడు. ఐసీసీ నిర్వహించిన వన్డే, టి20, టెస్ట్ ఫార్మాట్లలో టీమిండియాలో ఫైనల్ చేరేలాగా శిక్షణ ఇచ్చాడు. మరే జట్టు కూడా ఈ ఘనత సాధించలేదు. అయితే టెస్ట్ ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లలో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. టి20 వరల్డ్ కప్ విషయంలో మాత్రం ఆ సీన్ రిపీట్ కానివ్వలేదు. ఐర్లాండ్ నుంచి దక్షిణాఫ్రికా వరకు అన్ని జట్లపై వరుస విజయాలు సాధించి.. టీమిండియా విశ్వవిజేతగా ఆవిర్భవించింది. టి20 క్రికెట్ చరిత్రలో మరే జట్టూ సాధించని రికార్డును రోహిత్ సేన సొంతం చేసుకుంది. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలవడంతో కోచ్ రాహుల్ ద్రావిడ్ లో ఆనందం తారస్థాయికి చేరింది. అదే విషయాన్ని ఆయన చాలా ఉద్విగ్నంగా చెప్పాడు. సాధారణంగా ఎలాంటి ఫీలింగ్స్ బయటకు రానివ్వని ద్రావిడ్.. తొలిసారి అరిచాడు. గట్టిగా నవ్వాడు. ఇదే సందర్భంలో టీమిండియా కప్ గెలిచిన నేపథ్యంలో.. తన అనుభూతులను ప్రెస్ మీట్ లో వ్యక్తం చేశాడు. అందులో రోహిత్ శర్మ తనకు ఫోన్ చేసిన విషయాన్ని రాహుల్ ద్రావిడ్ ప్రముఖంగా ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది.

    గత ఏడాది నవంబర్లో స్వదేశం వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ ఓటమి నేపథ్యంలో రాహుల్ ద్రావిడ్ బీసీసీఐ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ దశలో రాహుల్ ద్రావిడ్ కు రోహిత్ శర్మ ఫోన్ చేశాడు. కనీసం టి20 వరల్డ్ కప్ వరకైనా జట్టుతో ఉండాలని రాహుల్ ద్రావిడ్ ను రోహిత్ కోరాడు. దీంతో ద్రావిడ్ మనసు మార్చుకుని టీమ్ ఇండియా కోచ్ గా కొనసాగాడు. ఈసారి సరికొత్తగా ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. అందువల్లే విపత్కర పరిస్థితిలోనూ టీమిండియా ఆటగాళ్లు గొప్ప ఆటతీరును ప్రదర్శించారు. ముఖ్యంగా పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లపై టీమిండి ఆటగాళ్లు చూపిన ప్రదర్శన అద్భుతం అనన్య సామాన్యం.

    ఇక నాడు రోహిత్ శర్మ ఫోన్ చేయకపోతే తాను ఇంత గొప్ప చరిత్రను చూసి ఉండేవాడిని కాదని రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించాడు. “ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు చాలామంది ఆటగాళ్లు సహకరించారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ నాకు ఆ రోజు ఫోన్ చేసి జట్టుతో కొనసాగాలని కోరాడు. ఆయన మాట మన్నించి నేను మనసు మార్చుకున్నాను. తిరిగి జట్టుతో ప్రయాణం ప్రారంభించాను. నాకు ఫోన్ చేసి తిరిగి రప్పించినందుకు రోహిత్ శర్మకు థాంక్స్” అంటూ రాహుల్ వ్యాఖ్యానించాడు.