CPL 2025 : పొట్టి ఫార్మాట్లో అద్భుతాలు జరుగుతుంటాయి. బంతి బంతికి సమీకరణాలు మారిపోతుంటాయి. గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోతుంది. ఓడిపోతుందనుకున్న జట్టు గెలుస్తుంది. అలాంటి అద్భుతమే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో చోటుచేసుకుంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో గయానా అమెజాన్ వారియర్స్, ట్రిన్ బాగో నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా పరుగులు తీశారు. అదే సమయంలో వికెట్లు కూడా తీశారు.
ఈ మ్యాచ్లో ముందుగా ట్రిన్ బాగో నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి.. ఐదు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. బ్రావో 33, పొలార్డ్ 54 పరుగులు చేశారు. ముఖ్యంగా పొలార్డ్ 18 బంతుల్లో ఐదు బౌండరీలు, ఐదు సిక్సర్లతో అదరగొట్టాడు. బ్రావో 35 బంతులు ఎదుర్కొని 33 పరుగులు మాత్రమే చేయడం విశేషం. కే కార్టీ 29 పరుగులు చేశాడు. ప్రిటోరియస్, షెఫర్డ్, మెయిన్, తాహిర్ తలా ఒక వికెట్ తీశారు.
168 పరుగుల విజయ లక్ష్యంతో గయాన జట్టు రంగంలోకి దిగింది. ఓపెనర్లు మోయిన్ అలీ(4), పాల్(6) నిరాశపరిచినప్పటికీ..షై హోప్ 53, హిట్ మేయర్ 49 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. వీరిద్దరూ స్వల్ప పరుగుల తేడాతో అవుట్ కావడం.. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో.. గయాన జట్టు ఇబ్బందులలో పడింది. ఈదశలో ప్రిటోరియస్ ఒక్కడై నిలిచాడు. ఒకే ఒక్కడిగా నిలబడ్డాడు. 14 బంతులు ఎదుర్కొన్న అతడు మూడు సిక్సర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. తద్వారా గయాన జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తం చివరి వరకు ఉత్కంఠ గా సాగింది. చివర్లో ప్రిటోరియస్ అదరగొట్టడంతో గయాన జట్టు ఉత్కంఠ భరితమైన విజయం సాధించింది..