Harish Rao : విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడు.. సిద్దిపేట ఎమ్మెల్యే.. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు కవిత మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని.. తాను ఏంటో అందరికీ తెలుసని.. నా మీద దాడి జరగడం ఇది తొలిసారి కాదని.. ఇలా చెప్పుకుంటూ పోయారు.
కవిత ఆ స్థాయిలో ఆరోపణలు చేసినప్పటికీ హరీష్ రావు నిదానాన్ని వ్యవహరించారు. హుందాతనాన్ని కొనసాగించారు. ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా సమయమనంతో మాట్లాడారు. వాస్తవానికి హరీష్ ఈ స్థాయిలో స్పందిస్తారని ఎవరు ఊహించలేదు. కాకపోతే కవిత మాదిరిగా తను కూడా మాట్లాడితే మరింత ఇబ్బంది అవుతుందని భావించి జాగ్రత్త వహించారు. ఈ విషయంలో హరీష్ రావుకు నూటికి నూరు మార్కులు పడతాయి. హరీష్ మాట్లాడిన తీరు పట్ల చివరికి కాంగ్రెస్ నాయకులు కూడా అంతరంగికంగా హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఇలాంటి హుందాతనమే ఉండాలంటూ వ్యాఖ్యానించారు. హరీష్ రావు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన తర్వాత.. సోషల్ మీడియాలో ఆయన పై దాడి మొదలైంది.
ఎవరు చేస్తున్నారు
రాజకీయాలలో ఎదుగుదల అనేది కచ్చితంగా ఉంటుంది. దానికి హరీష్ రావు మినహాయింపు కాదు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమానికి వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టె, రబ్బర్ చెప్పులు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు వేల కోట్లకు ఎదిగిపోయాడని.. ఆయన సతీమణికి పాల వ్యాపారం ఉందని.. అజీజ్ నగర్లో వ్యవసాయ క్షేత్రం.. రంగనాయక సాగర్ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం.. ఇతర ప్రాంతాలలో కర్మ గారాలు.. ఇతర దేశాలలో పెట్టుబడులు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బిజెపి, కాంగ్రెస్ పార్టీ కూడా హరీష్ మీద ఈ స్థాయిలో ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. సిద్ధాంతపరంగా మాత్రమే హరీష్ మీద ఆ రెండు పార్టీలు ఆరోపణలు చేశాయి. అయితే హరీష్ మీద ఈ స్థాయిలో దాడి జరగడం వెనుక ఉన్నది ఎవరనే చర్చ ప్రస్తుతం తెలంగాణ సమాజంలో నడుస్తోంది. కవిత చేసిన ఆరోపణలకు హరీష్ ఇచ్చిన సమాధానం తర్వాత సోషల్ మీడియాలో ఆయనపై దాడి అనేది విపరీతమైపోయింది. అయితే దీని వెనుక ఉన్నది కవిత వర్గీయులా? ఇంకా ఇతర వ్యక్తులా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హరీష్ మీద సోషల్ మీడియాలో దాడి జరుగుతున్న నేపథ్యంలో.. ఆయన అనుచరులు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. హరీష్ అంటే ఏమిటో సిద్దిపేట నగరానికి వచ్చి చూడాలని.. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు.