India Vs South Africa Final: దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. శనివారం వెస్టిండీస్ లోని బార్బడోస్ మైదానం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్ లో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి 8 పరుగులు ఇచ్చాడు. 20వ మొదటి బంతికి డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టి.. భారత జట్టు వైపు మ్యాచ్ మొగ్గేలా చేశాడు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో.. టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 2007 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. 2014లో ఫైనల్ వెళ్లినప్పటికీ శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
భారత జట్టు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్ లో అతడు విఫలమయ్యాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ లో అతనిపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. 76 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచాడు. 34 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ 9, రిషబ్ పంత్ 0, సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులకే అవుట్ కావడంతో తీవ్ర కష్టాల్లో పడింది. ఈదశలో విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ తో కలిసి నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించాడు. ఇదే క్రమంలో విరాట్ 59 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ కూడా 47 పరుగులు చేశాడు. విరాట్ ఫైనల్ మ్యాచ్ లో టచ్ లోకి రావడంతో భారత్ 176 పరుగుల స్కోర్ చేయగలిగింది. దక్షిణాఫ్రికా ను 169 పరుగులకు కట్టడి చేయగలిగింది. 17 సంవత్సరాల తర్వాత చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.
టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. యువత రోడ్లమీదకి వచ్చి బాణసంచా కాల్చి వేడుకలు చేసుకుంది. టీమిండియా విజయం నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన విరాట్ కోహ్లీ,. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ ద్రావిడ్ కు ఫోన్ చేశారు. ” చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా మీకు నా అభినందనలు. 100 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న ప్రజల ఆకాంక్షలను మీరు నిజం చేసి చూపించారు. విశ్వ యవనికపై భారతీయ జెండాను రెపరెపలాడించారు. మీరు సాధించిన ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇలాంటి విజయాలను టీమిండియా మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మీ ఆధ్వర్యంలో టీమిండియా సాధించిన విజయం గొప్ప అనుభూతిని ఇస్తోందని” నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు.
మరోవైపు టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా రోహిత్ సేన టి20 వరల్డ్ కప్ గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ” ఫైనల్లో విజయం సాధించడం పట్ల ఆనందంగా ఉంది. టీమిండియా ఆడిన తీరు అద్భుతం. రోహిత్ శర్మ నాయకత్వం, విరాట్ కోహ్లీ పరాక్రమం, బుమ్రా బౌలింగ్లో నేర్పరితనం, అక్షర్ పటేల్ చూపించిన తెగువ టీమిండియా విజయానికి కారణాలయ్యాయి. ఈ విజయం చాలామంది యువతను బ్లూ జెర్సీ వైపు నడిపిస్తుందని” సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. టీ మీడియా విజయం పట్ల మిగతా వెటరన్ క్రీడాకారులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కప్ దక్కించుకున్న ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Dear @imVkohli,
Glad to have spoken to you. Like the innings in the Finals, you have anchored Indian batting splendidly. You’ve shone in all forms of the game. T20 Cricket will miss you but I am confident you’ll continue to motivate the new generation of players. pic.twitter.com/rw8fKvgTbA
— Narendra Modi (@narendramodi) June 30, 2024