Naga Babu: చిరంజీవి స్టార్ గా ఎదిగిన తీరు లక్షల మందిలో స్ఫూర్తి నింపింది. ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి ఆయన నెంబర్ వన్ హీరో అయ్యారు. చిరంజీవి పరిశ్రమకు వచ్చే నాటికి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి నటులు పరిశ్రమను ఏలుతున్నారు. మహామాహులను వెనక్కి నెట్టి చిరంజీవి ప్రతిభ, కష్టంతో నెంబర్ వన్ హీరో అయ్యాడు. తిరుగులేని హీరోగా స్థిరపడిన చిరంజీవి తన ఇద్దరు తమ్ముళ్ల కెరీర్ సెట్ చేసే ప్రయత్నం చేశాడు.
చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. ఆ ఫేమ్ ఆయనను రాజకీయాల్లో రాణించేలా చేసింది. నాగబాబును కూడా ఒక స్థాయిలో నిలబెట్టాలని చిరంజీవి చాలా ప్రయత్నం చేశారు. మొదట్లో నటుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించాడు. అనంతరం నిర్మాతగా రాణించాలని అనుకున్నాడు. అంజనా ప్రొడక్షన్స్ ఏర్పాటు చేసి చిరంజీవి హీరోగా నాగబాబు సినిమాలు నిర్మించారు. అయితే నాగబాబు నిర్మాతగా చిరంజీవి నటించిన ఒక్క చిత్రం కూడా హిట్ కాలేదు.
ఏదేమైనా తన ఇద్దరు తమ్ముళ్లకు చిరంజీవి ఎప్పుడూ తోడుగానే ఉన్నారు. అయితే ఓ సందర్భంలో నాగబాబును చిరంజీవి కొట్టారట. అయితే అది వారు పెద్దయ్యాక కాదు. చిరంజీవి సినిమాల్లోకి రాక ముందు. బాల్యంలో ఇంటికి పెద్ద కొడుకుగా చిరంజీవి తల్లిదండ్రులకు అన్ని పనుల్లో సహాయంగా ఉండేవాడట. చిరంజీవి ఇంటర్ చదివే రోజుల్లో ఏదో పని మీద బయటకు వెళుతూ.. నాగబాబును లాండ్రీ కి వెళ్లి బట్టలు తీసుకునిరా అని చెప్పాడట.
ఇంటికి తిరిగి వచ్చాక లాండ్రీ నుండి బట్టలు తెచ్చావా అని అడిగితే… నాగబాబు తేలేదని సమాధానం చెప్పాడట. ఎందుకు తీసుకురాలేదని చిరంజీవి అడిగాడట. నిద్రపోయాను అని నాగబాబు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడట. దాంతో చిరంజీవికి కోపం వచ్చిందట. నాగబాబును చిరంజీవి కొట్టాడట. నాగబాబు వెళ్లి తల్లి అంజనాదేవికి అన్నయ్య కొట్టాడని చెప్పాడట. అప్పుడు అంజనాదేవి చిరంజీవి మీద కోప్పడ్డారట. సాయంత్రం తండ్రి వెంకటరావు వచ్చాక విషయం చెప్పారట. ఆయన చిరంజీవినే సమర్ధించారట… అదన్నమాట సంగతి…