IND vs ENG 1st ODI
IND vs ENG: మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా బౌలింగ్ వేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత మహమ్మద్ షమీ జట్టులోకి వచ్చినప్పటికీ.. తన పూర్వపు మ్యాజిక్ ప్రదర్శించలేకపోతున్నాడు. హర్షిత్ రాణా తేలిపోతున్నాడు. వీరిద్దరిని డకెట్, సాల్ట్ ధైర్యంగా కాచుకుంటున్నారు. ఇప్పటికే వీరు తొలి వికెట్ కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్షిత్ బౌలింగ్ ను సాల్ట్ ఉప్పు పాతర వేశాడు. ముఖ్యంగా ఆరో ఓవర్ లో సాల్ట్ హర్షిత్ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు.. హర్షిత్ వేసిన తొలి బంతిని కీపర్ దిశగా సాల్ట్ భారీ సిక్సర్ కొట్టాడు. రెండవ బంతిని ఫోర్ గా మలిచాడు. మూడో బంతిని సిక్సర్ కొట్టాడు. నాలుగో బంతిని మళ్ళీ ఫోర్ కొట్టాడు. ఐదవ బంతిని ఈసారి హర్షిత్ వైవిధ్యంగా వేయగా సాల్ట్ డిఫెన్స్ ఆడాడు.. చివరి బంతిని సాల్ట్ సిక్సర్ కొట్టాడు.. ఈ ఓవర్లో మొత్తంగా సాల్ట్ 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో హర్షిత్ ఒక్కసారిగా బిత్తర పోయాడు. బంతులు ఎటువైపు సంధించినా సాల్ట్ దంచి కొట్టాడు. మైదానం నలుమూలల షాట్లు కొట్టాడు.
సాల్ట్ రన్ అవుట్
భారత బౌలర్లకు సింహ స్వప్నం లాగా మారిపోయిన సాల్ట్ రన్ అవుట్ అయ్యాడు. హార్థిక్ పాండ్యా బౌలింగ్లో షాట్ కొట్టిన సాల్ట్ రెండు పరుగులు తీశాడు. అయితే మూడో పరుగు రావాలని డకెట్ ముందుకు వచ్చాడు. అయితే బంతిని వేగంగా విసరడంలో శ్రేయస్ అయ్యర్ చొరవ చూపించాడు. కేఎల్ రాహుల్ ఆ బంతితో వికెట్లను పడగొట్టాడు. దీంతో సాల్ట్ రన్ అవుట్ అయ్యాడు. ఫలితంగా భారత శిబిరంలో కాస్త ఉత్సాహం వచ్చింది.. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోర్ ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. సాల్ట్ 26 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజ్ లో రూట్(0), డకెట్ (31) ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఒక వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. క్యూరేటర్ చెప్పినట్టుగానే మైదానం బ్యాటర్లకు అనుకూలిస్తోంది. బంతి ఏమాత్రం స్వింగ్ అవడం లేదు. స్పిన్ బౌలర్లే కాస్త బంతిని మెలి తిప్పుతున్నారు. మైదానం నుంచి సహకారం లభించకపోవడంతో పేస్ బౌలర్లు నిరాశ చెందుతున్నారు. షమీ, హర్షిత్ ఎలాంటి బంతులు వేసినా ఇంగ్లాండ్ ఆటగాళ్లు దీటుగా ఎదుర్కోవడం విశేషం. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ ను రంగంలోకి దింపాడు. మరోవైపు హర్షిత్ ను పక్కనపెట్టి హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లోనే సాల్ట్ రన్ అవుట్ కావడం విశేషం.