https://oktelugu.com/

India VS Pakistan : అలా నరుక్కొచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన దుస్థితిలో బీసీసీఐ

ఛాంపియన్స్ టోర్నీకి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈసారి టోర్నీ నిర్వహించే బాధ్యతను ఐసీసీ పాకిస్తాన్ కు ఇచ్చింది.. అయితే పాకిస్తాన్ దేశంలో తమ జట్టును ఆడించేందుకు బీసీసీఐ ప్రారంభం నుంచి విముఖత వ్యక్తం చేస్తోంది. భారత్ - పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే టీమిండియాను బీసీసీఐ దాయాది దేశానికి పంపించకపోవడానికి కారణమని తెలుస్తోంది

Written By:
  • Bhaskar
  • , Updated On : July 16, 2024 / 12:07 PM IST
    Follow us on

    India VS Pakistan : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి బిసిసిఐ, పిసిబి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇంకా తగ్గడం లేదు. పైగా ఇది చినికి చినికి గాలివాన లాగా మారింది. పాకిస్తాన్ లో తమ జట్టు ఆటగాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడబోరని బీసీసీఐ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ సరికొత్త పల్లవి అందుకుంది. టీమిండియాను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే ప్రణాళిక రూపొందించింది.

    ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ..

    ఛాంపియన్స్ టోర్నీకి ఇంకా ఆరు నెలల సమయం ఉంది. ఈసారి టోర్నీ నిర్వహించే బాధ్యతను ఐసీసీ పాకిస్తాన్ కు ఇచ్చింది.. అయితే పాకిస్తాన్ దేశంలో తమ జట్టును ఆడించేందుకు బీసీసీఐ ప్రారంభం నుంచి విముఖత వ్యక్తం చేస్తోంది. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే టీమిండియాను బీసీసీఐ దాయాది దేశానికి పంపించకపోవడానికి కారణమని తెలుస్తోంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఐసీసీకి ముసాయిదా షెడ్యూల్ పంపించింది.. భారత్ ఆడే మ్యాచ్ లు అన్నింటిన్నీ లాహోర్ లో నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముసాయిదా షెడ్యూల్ లో ఐసీసీకి విన్నవించింది. అయితే తాము ఆ దేశంలో ఆడేది లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. ” ఆ దేశం – భారత్ కు మధ్య విరోధం కొనసాగుతోంది. సరిహద్దుల్లో ఏదో ఒక ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నది. 2008 నుంచి ఆ దేశంలో మా జట్టు ఆటగాళ్లు పర్యటించడం లేదు. అలాంటప్పుడు మేము సరికొత్త నిర్ణయం తీసుకోలేం. మా జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ లో పర్యటించాలంటే కచ్చితంగా మా దేశ ప్రభుత్వం అనుమతి ఉండాల్సిందే. ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని” బీసీసీఐ బాధ్యులు ఇప్పటికే పలు వేదికలపై ప్రకటించారు.

    రాత పూర్వక రుజువు ఇవ్వాలి

    ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ కు వెళ్లకపోతే లేదా భారత జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాతపూర్వక రుజువు ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐని కోరింది. తదుపరి చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. టీమిండియాను పాకిస్తాన్ కు పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరిస్తే.. దీనికి సంబంధించి మాకు రాతపూర్వక రుజువు ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది. ఈరోజు మనం బీసీసీఐ, ఐసీసీకి సమర్పించాలని పాకిస్తాన్ కోరినట్టు తెలుస్తోంది. టోర్నీ నిర్వహణకు ప్రారంభానికి మధ్య ఈ రాతపూర్వక రుజువు ఇవ్వాలని పిసిబి పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.

    ఎటువంటి చర్చలు జరపలేదు

    టీమిండియాను పాకిస్తాన్ కు పంపించే విషయమై భారత ప్రభుత్వం లేదా బీసీసీఐ ఇంతవరకు ఎటువంటి చర్చలు జరపలేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. రాజీవ్ శుక్లా ఆ తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. టీమిండియా పాకిస్తాన్ వెళ్లడం కష్టమేనని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భారత్ పాకిస్థాన్ లో ఆడే పరిస్థితి కనుక వస్తే.. ఆ జట్టుకు బదులు హైబ్రిడ్ ఫార్మాట్ లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్టు తెలుస్తోంది. భారత జట్టు ఆడే మ్యాచ్ లను శ్రీలంక లేదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించాలని బిసిసిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో ఆసియా కప్ లోనూ ఇదే తరహాలో టీమిండియా మ్యాచ్ లు ఆడింది. అదే తరహాలో హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహించాలని బిసిసిఐ కోరుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీపై బిసిసిఐ ఎటువంటి నిర్ణయం తీసుకోకముందే.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సవాల్ చేయడం మొదలుపెట్టింది. భారత్ – శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే 2026 t20 ప్రపంచ కప్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ మోడ్ లో టోర్నీ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకోవాలని జూలై 19, 22 మధ్య కొలంబోలో జరిగే ఐసీసీ వార్షిక సమావేశంలో పిసిబి కోరుకుంటున్నదని తెలుస్తోంది.