SRH Vs CSK 2024: ధోని బ్యాటింగ్ కి రావద్దని.. కమిన్స్ మాస్టర్ ప్లాన్.. వర్కవుటయింది ఇలా..

166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలోనే గెలుపును అందుకుంది. హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 6, 2024 11:31 am

SRH Vs CSK 2024

Follow us on

SRH Vs CSK 2024: సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు మరోసారి సత్తా చాటింది. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టుతో జరిగిన రెండవ మ్యాచ్లో సొంత మైదానం వేదికగా ఐపిఎల్ చరిత్రలోనే అత్యధికంగా 277 పరుగుల స్కోరు సాధించింది. తాజాగా శుక్రవారం రాత్రి చెన్నై జట్టు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మరింత కట్టుదిట్టంగా ఆడింది. సొంతమైదానం.. సొంత ప్రేక్షకులు.. పిచ్ పై పూర్తిస్థాయిలో అవగాహన.. మెరుగైన ఆటగాళ్లు.. ఇలా ఇన్ని సానుకూల అంశాల మధ్య హైదరాబాద్ జట్టు దుమ్మురేపింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బలమైన చెన్నై జట్టును కేవలం 165 పరుగులకే పరిమితం చేసింది. బౌలింగ్ తో పాటు ఫీల్డర్లు చురుగ్గా కలవడంతో పరుగులు తీయడానికి చెన్నై బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు. చెన్నై జట్టులో శివం దూబె, అజింక్య రహనే, రవీంద్ర జడేజా, వంటి వారు రాణించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. భారీ స్కోరు సాధిస్తుందనుకున్న అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం 165 పరుగులకే పరిమితమైపోయింది.

166 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లలోనే గెలుపును అందుకుంది. హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. వీరోచిత బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ఈ విజయంతో పాయింట్లు పట్టికలో హైదరాబాద్ జట్టు ఐదవ స్థానంలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో సోషల్ మీడియా మోతెక్కి పోతోంది. ఆరెంజ్ ఆర్మీ, సన్ రైజర్స్ హైదరాబాద్ యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.

ఇక ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ తర్వాత ఆ స్థాయిలో సోషల్ మీడియాలో ఓ సంఘటన హల్ చల్ చేస్తోంది. ఆ సంఘటన ద్వారా హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్ మాస్టర్ బ్రెయిన్ ఎలా ఉంటుందో అభిమానులకు మరోసారి తెలిసిపోయింది. ఇతడి నాయకత్వంలోనే గత వరల్డ్ కప్ ఆస్ట్రేలియా దక్కించుకుంది. భారత జట్టు పై కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ సాధించింది. అది కూడా భారతదేశం వేదికగా.. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో చెన్నై జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కమిన్స్ అద్భుతమైన ప్రణాళికను అమలులో పెట్టాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఆశించినంత స్థాయిలో ఆటను ప్రదర్శించలేదు. మ్యాచ్ 19 ఓవర్ లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తున్నాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న రవీంద్ర జడేజా డిఫెన్స్ ఆడాడు. ఒక పరుగు కోసం ప్రయత్నించి వెనక్కి వెళ్ళాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ బంతితో త్రో కొట్టడంతో అది రవీంద్ర జడేజా వీపును తగిలింది. క్రికెట్ నిబంధనల ప్రకారం దానిని అబ్స్ట్రక్షన్ అవుట్ గా పరిగణిస్తారు. కానీ కెప్టెన్ కమిన్స్ ప్లానింగ్ ప్రకారం రివ్యూ తీసుకోలేదు. ఎందుకంటే జడేజా అవుట్ అయితే ధోని మైదానంలోకి వస్తాడు. మిగిలిన ఐదు బంతుల్ని అతడు ఊచకోత కోస్తాడు. గత మ్యాచ్ లో ధోని దూకుడయిన బ్యాటింగ్ చూసిన హైదరాబాద్ కెప్టెన్.. అత్యంత తెలివిని ప్రదర్శించాడు. ఫలితంగా ధోని మైదానంలోకి రాలేకపోయాడు.. ఈ క్రమంలో మార్ష్ అవుట్ కావడంతో.. ధోని బ్యాటింగ్ కు వచ్చాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒక్క పరుగు మాత్రమే తీశాడు. కాగా, కమిన్స్ వ్యూహ చతురత పట్ల నెట్టింట అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.