Pat Cummins: చెన్నై బలహీనత కమిన్స్ పసిగట్టాడు.. బౌలింగ్ దళంతో చుట్టుముట్టాడు

చెన్నై జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ ను షాబాజ్ అహ్మద్ తో అవుట్ చేయించిన కమిన్స్.. అజింక్య రహానే, శివమ్ దూబె జోడిని కూడా అలానే అవుట్ చేయించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 6, 2024 4:36 pm

Pat Cummins

Follow us on

Pat Cummins: శత్రువును ఓడించాలంటే ముందు బలహీనతలు పసిగట్టాలి. ఆ బలహీనతల ఆధారంగానే అస్త్రాలు సంధించాలి. శస్త్రాలు వదలాలి. అప్పుడే శత్రువు జుట్టు మన చేతిలో ఉంటుంది. గెలుపు మన చేతిలోకి వస్తుంది. ఈ సూత్రాన్ని నమ్మాడు. ఆచరణలో పెట్టాడు కాబట్టే.. ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ జట్టును గెలిపించాడు. బలమైన చెన్నైని ఓడించాడు. సొంత మైదానంలో టాస్ గెలిచి.. బౌలింగ్ ఎంచుకున్నప్పుడు కమిన్స్ ను వింతగా చూశారు. ఇతడేంటి బౌలింగ్ ఎంచుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. చెన్నై ఊచకోత తెలిసి కూడా బౌలింగ్ ఎంచుకోవడం ఏంటని ప్రశ్నించారు. కానీ కమిన్స్ వీటన్నింటినీ లైట్ తీసుకున్నాడు.

తన అస్త్ర శస్త్రాలను అమల్లో పెట్టాడు. ఫలితంగా చెన్నై జట్టు ఒడిదుడుకులు ఎదుర్కొంది. బలమైన బ్యాటింగ్ లైన్ అప్ కలిగి ఉన్న ఆ జట్టు హైదరాబాద్ బౌలర్ల ముందు వణికి పోయింది. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతలను తెలుసుకున్న కమిన్స్.. తన జట్టు బౌలర్లతో అద్భుతంగా బౌలింగ్ చేయించాడు. ఈ సీజన్లో ఒక ఓవర్లో రెండు బౌన్సర్లు వేసుకునే అవకాశం బౌలర్లకు కలగడంతో.. ఆ అవకాశాన్ని కమిన్స్ విజయవంతంగా తన బౌలర్లతో వినియోగించుకునేలా చేశాడు. ఫలితంగా హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్, జయ దేవ్, నటరాజన్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే, షాబాద్ అహ్మద్ వంటి వారితో వినూత్నంగా బౌలింగ్ చేయించి చెన్నై జట్టును కట్టడి చేశాడు.. భువనేశ్వర్ కుమార్ తో రచిన్ రవీంద్ర ఉచ్చులో పడేశాడు. అతడు వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు రవీంద్ర ప్రయత్నించగా.. మార్క్రమ్ కు అతడు దొరికిపోయాడు. రవీంద్ర 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి చెన్నై జట్టు స్కోరు కేవలం 25 పరుగులు మాత్రమే. బలమైన ఓపెనర్ ను కోల్పోవడంతో చెన్నై జట్టు ఒకింత డైలమాలో పడింది.

చెన్నై జట్టు కెప్టెన్ రుతు రాజ్ గైక్వాడ్ ను షాబాజ్ అహ్మద్ తో అవుట్ చేయించిన కమిన్స్.. అజింక్య రహానే, శివమ్ దూబె జోడిని కూడా అలానే అవుట్ చేయించాడు. జయదేవ్ ఉనద్కత్ తో స్లో డెలివరీ వేయించి రహానే ను బోల్తా కొట్టించాడు. శివమ్ దూబెను కమిన్స్ పెవిలియన్ పంపించాడు. నటరాజన్ తో అద్భుతమైన బంతి వేయించి మిచెల్ మార్ష్ ను పె విలియన్ పంపించాడు. ఇలా బౌలింగ్ తో చెన్నై జట్టును కట్టడి చేయించి సరికొత్త బౌలింగ్ ప్రణాళికలను కమిన్స్ అమల్లో పెట్టాడు. ఫలితంగా హైదరాబాద్ జట్టు 6 వికెట్ల తేడాతో చెన్నై పై విజయాన్ని సాధించింది.