Pat Cummins: గత సీజన్లో కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు.. ఫైనల్ మ్యాచ్లో ఓటమి పాలైనప్పటికీ.. హైదరాబాద్ అభిమానుల ప్రశంసలు పొందాడు కమిన్స్.. ఇటీవల ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడినప్పుడు కమిన్స్ దూరమయ్యాడు..కానీ అదే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడే విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు. తనకు ఎన్ని సమస్యలు ఉన్నా జట్టుకు ఆడేందుకు ముందుకు వచ్చాడు.. ఇది హైదరాబాద్ అభిమానులకు తెగ నచ్చింది. ఇక తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై హైదరాబాద్ 286 పరుగులు చేయడంతో కమిన్స్ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ గా మారిపోయాడు. అయితే అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడు ఓటములు ఎదుర్కోడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు..మూడు ఓటములు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం హైదరాబాద్ జట్టులో ప్లానింగ్ లోపించడమే.. ఆ ప్లానింగ్ గనుక సరిగ్గా ఉండి ఉంటే హైదరాబాద్ జట్టు వరుస విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో మొదటి స్థానంలో కొనసాగేది.. ఈ మాట సీనియర్ ఆటగాళ్లు తమ స్వీయ పరిశీలనలో అంటున్నారు.
Also Read: వరుసగా మూడో ఓటమి.. SRH ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే మంచిది
300 మాత్రమేనా..
“అనువుగానిచోట అధికుల మనరాదు” అని వెనకటికి ఒక సామెత ఉంది. కానీ దీనిని హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తొలి మ్యాచ్లో రాజస్థాన్ జట్టుపై 286 పరుగులు చేసిన ఉత్సాహంతో తమ తదుపరి టార్గెట్ 300 అని హైదరాబాద్ కెప్టెన్ అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇక ఇటీవల లక్నో జట్టుతో ఓడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ కెప్టెన్ తమ టార్గెట్ 300 అని వ్యాఖ్యలు చేయడం విశేషం. వాస్తవానికి ఐపీఎల్లో 300 స్కోర్ అనేది బెంచ్ మార్క్ కాదు. ఆటను ఎంత గొప్పగా ఆడాం.. ఎంతగా ఆస్వాదిస్తూ ఆడాం.. తక్కువ స్కోరు చేసినా ఎంతలా నిలుపుకున్నామనేదే ముఖ్యం.. ఆస్ట్రేలియా కెప్టెన్ గా వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలు అందించిన సారధిగా కమిన్స్ కు ఈ విషయం తెలియంది కాదు. కానీ ఎక్కడో ప్లానింగ్ తేడా కొడుతోంది.. నిర్లక్ష్యమైన బౌలింగ్.. ప్లానింగ్ అంటూ లేకుండా సాగుతున్న బ్యాటింగ్.. బద్ధకంగా ఉన్న ఫీల్డింగ్.. హైదరాబాద్ జట్టుకు ప్రతిబంధకాలుగా మారాయి. వరుసగా ఢిల్లీ, లక్నో, కోల్ కతా పై జరిగిన మ్యాచ్లలో ఇవి సజీవంగా కనిపించాయి. వీటిని మార్చుకోవాలని ఉద్దేశం గాని.. ఓటముల ద్వారా ఎదురైన గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకోవాలనే తాపత్రయంగాని హైదరాబాద్ ఆటగాళ్లలో కనిపించడం లేదు. దీనివల్ల జట్టు పరువు పోవడమే కాదు.. అభిమానుల ఆశలు కూడా ఆడియసలవుతున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో కోల్ కతా స్టేడియంలో టికెట్ ధరలను భారీగా పెంచినప్పటికీ అభిమానులు విపరీతంగా వచ్చారు.. అందులో మెజారిటీ శాతం హైదరాబాద్ అభిమానులే ఉన్నారు. హైదరాబాద్ జట్టు కనుక ఇలాగనే ఓటములు చవి చూస్తే.. మ్యాచ్ చూసేందుకు అభిమానులు స్టేడియం దాకా రారు. ఎందుకంటే డబ్బులు పెట్టి ఓటమిని చూడడం వారికి ఇష్టం ఉండదు. ఇప్పటికైనా దీనిని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అర్థం చేసుకుంటే మంచిది. లేకపోతే గ్రూప్ దశ నుంచే జట్టు నిష్క్రమించడం ఖాయం.