Paris Olympics 2024: న భూతో న భవిష్యతి .. పారిస్ లో అంబరాన్నంటిన ఒలింపిక్ ప్రారంభ వేడుకలు

ప్రారంభ వేడుకలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకున్నారు.. ముఖ్యంగా ఒక చిన్న పడవలో ముగ్గురు పిల్లలు, ముసుగు ధరించిన వ్యక్తి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత వాటర్ స్క్రీన్లను చీల్చుకుంటూ గ్రీస్ క్రీడాకారుల బృందం పరేడ్ లో పాల్గొన్నది.

Written By: Anabothula Bhaskar, Updated On : July 27, 2024 10:04 am
Follow us on

Paris Olympics 2024 :  ఫ్యాషన్, ప్రేమకు రాజధానిగా విలసిల్లే పారిస్.. విశ్వ క్రీడలకు కూడా అదే స్థాయిలో ఆతిథ్యం ఇచ్చింది. ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నే.. సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించింది.. ఒలింపిక్ జ్యోతితో ఒక వ్యక్తి చేసిన ప్రయాణం ద్వారా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. వర్చువల్ సాంకేతిక మాయాజాలం ఫ్రాన్స్ చరిత్రను సరికొత్తగా చెప్పింది. దాని ఘనమైన వారత్వాన్ని విభిన్నంగా వివరించింది. కళాకారుల ప్రదర్శన అనన్య సామాన్యంగా నిలిచింది. నదిలోని నీటి తుంపరలు చిరుజల్లులుగా కురిసి క్రీడాకారులను తన్మయత్వానికి గురిచేసాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలా.. సెన్ నది పై ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అద్భుతంగా జరిగాయి. క్రీడా ప్రారంభోత్సవ సంబరాలు ఇలా కూడా నిర్వహిస్తారా? అనేతీరుగా ఆరంభ వేడుకలు జరిగాయి. విప్లవానికి, ఫ్యాషన్ కు, నిలువెత్తు ప్రేమకు నిదర్శనమైన పారిస్.. తన ప్రత్యేకతను విశ్వ క్రీడల ప్రారంభోత్సవంలోనూ ప్రదర్శించింది. యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేసింది.

సెన్ నదిపై..

విశ్వ క్రీడల ప్రారంభ వేడుకలు సెన్ నది వేదికగా జరిగాయి. ఒలింపిక్ చరిత్రలో ఒక నదిపై ప్రారంభ వేడుకలు జరగడం దాదాపు ఇదే తొలిసారి కావచ్చు. నదిపై నిర్మించిన తాత్కాలిక సెట్టింగ్ పై 6 కిలోమీటర్ల పాటు పరేడ్ నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన 85 పడవలపై 6,800 మంది క్రీడాకారులు సందడి చేశారు. ఈ వేడుకలను చూసేందుకు దాదాపు 3,20,000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా హాజరయ్యారు. ఒలింపిక్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. వాస్తవానికి గతంలో నిర్వహించిన ఒలింపిక్ క్రీడలకు ఈ స్థాయిలో ప్రేక్షకులు హాజరు కాలేదు. ప్రారంభ వేడుకలను ప్రేక్షకులు వీక్షించేందుకు ఒలింపిక్ నిర్వహణ కమిటీ ఏకంగా 80 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ప్రారంభ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్, పలువురు క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రారంభ వేడుకలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకున్నారు.. ముఖ్యంగా ఒక చిన్న పడవలో ముగ్గురు పిల్లలు, ముసుగు ధరించిన వ్యక్తి ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత వాటర్ స్క్రీన్లను చీల్చుకుంటూ గ్రీస్ క్రీడాకారుల బృందం పరేడ్ లో పాల్గొన్నది.. వీరి తర్వాత శరణార్థి ఆటగాళ్ల బృందం వచ్చింది.. అనంతరం ఫ్రెంచ్ వర్ణమాల క్రమంలో మిగతా దేశాలకు చెందిన క్రీడాకారులు పరేడ్ లో పాల్గొన్నారు.. ఈ బృందంలో 84వ దేశంగా భారత్ వచ్చింది. ఈ పరేడ్ సాగుతున్నప్పుడు ప్రఖ్యాత పాప్ సింగర్ “లేడీ గాగా”తన పాటలతో, ప్రదర్శనలతో క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. లేడీ గాగా పాడుతున్న పాటలకు అనుగుణంగా సెన్ నదికి ఇరువైపులా కళాకారులు డాన్సులు వేశారు. రకరకాల విన్యాసాలను ప్రదర్శించారు.

ప్రారంభ వేడుకల్లో భాగంగా ముసుగు ధరించిన వ్యక్తి ఒలింపిక్ జ్యోతితో వేదిక వద్దకు వచ్చాడు. వర్చువల్ విధానంలో అతడు గాల్లోకి తాడు సహాయంతో ఎగురుతూ వచ్చాడు. సెన్ నదిని అవలీలగా దాటాడు. అతడు నదిని దాటుతున్నప్పుడు వర్చువల్ సాంకేతికత సహాయంతో ఫ్రెంచ్ సంస్కృతిని స్క్రీన్ లపై ప్రదర్శించారు. ఫ్రెంచ్ ప్రాంతంలో ఉన్న చారిత్రక కట్టడాల గురించి ప్రత్యేకంగా వివరించారు. ఈ సందర్భంగా కళాకారులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జిమ్నాస్ట్ లు తమ విన్యాసాలతో క్రీడాభిమానులను అలరించారు. ఇవే కాకుండా పారిస్ లోని క్రీడా గ్రామంలో రంగులను చల్లడం, బాణాసంచా కాల్చడం, పూలను గాల్లో నుంచి వదలడం వంటి విన్యాసాలు ప్రత్యేకంగా నిలిచాయి.