Pakistan cricket Team : టెస్ట్ క్రికెట్ లో బంగ్లాదేశ్ జట్టుకు గొప్ప పేరంటూ లేదు. సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ జట్టు భారీ విజయాలు సాధించిన దాఖలాలు పెద్దగా లేవు. అలాంటి బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ పై టెస్ట్ క్రికెట్ లో తొలిసారి మట్టి కరిపించింది. రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో పాక్ ను పడగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటి సరికొత్త చరిత్ర సృష్టించింది.. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లు పట్టికలో పాకిస్తాన్ 8వ స్థానానికి పడిపోయింది. అంతకుముందు ఆ జట్టు ఆరవ స్థానంలో ఉండేది. ప్రస్తుతం 30.56 శాతం పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్లు పట్టికలో 9 జట్లు మాత్రమే ఉంటాయి. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జరుగుతాయి. పేలవమైన ఆటతీరుతో పాకిస్తాన్ జట్టు డబ్ల్యూ టీ సీ ఫైనల్స్ కు ఎంపికయ్యే అవకాశాలు క్లిష్టంగా మారాయని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్ ఐదో స్థానానికి
పాకిస్తాన్ జట్టుపై పది వికెట్ల తేడాతో తొలి టెస్ట్ బంగ్లాదేశ్ గెలిచిన నేపథ్యంలో.. ఆ జట్టు ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకుంది. 40.00% పాయింట్లతో 5వ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం టీమిండియా 68.52% పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా 62.50% తో రెండవ స్థానం, న్యూజిలాండ్ 50.00% తో మూడవ స్థానం, శనివారం శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో 41.07% పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది..40.00% పాయింట్లతో శ్రీలంక ఆరవ స్థానం, 38.89%, పాయింట్లతో దక్షిణాఫ్రికా ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి.. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇప్పటివరకు వెస్టిండీస్ తొమ్మిది మ్యాచ్ లు ఆడింది.. 18.52% పాయింట్లతో ఈ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.
దిగువకు పడిపోయింది
పాకిస్తాన్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దిగువకు పడిపోవడంతో ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఆటగాళ్లు స్వదేశంలో కూడా జట్టును గెలిపించుకోలేకపోతున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. “ముందుగా జట్టును బాగు చేయాలి. కెప్టెన్ ను మార్చేయాలి. సమర్థవంతమైన నాయకుడిని నియమించాలి. అప్పుడే టీం బాగుపడుతుంది. లేకుంటే స్వదేశంలోనూ ఇలాంటి దారుణమైన ఓటములను ఎదుర్కోవాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి అంటే తల దించుకోవాల్సిన విషయమని” పాక్ అభిమానులు వాపోతున్నారు.