Pakistan Vs India: నిన్నటి మ్యాచ్లో.. ఇండియా సాధించిన విజయంలో బౌలింగ్ లో కులదీప్ యాదవ్, బ్యాటింగ్ లో తిలక్ వర్మ ముఖ్యపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో అదృష్టం మాత్రం రింకు సింగ్ ను వరించింది. పైగా దానిని అతడు కోరుకున్నాడు కూడా. అలానే జరగాలని భావించాడు కూడా. వీటన్నిటికంటే ముందు ఇలా జరుగుతుందని.. తనకు ఆ బాధ్యత లభిస్తుందని చెప్పేశాడు.
పరుగుల వేటలో టీమిండియా తడబడింది. కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. భీకరమైన ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ దారుణంగా అవుట్ అయ్యాడు. గిల్ కూడా అతడి దారిని అనుసరించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరిచాడు. ఇంతటి విపత్కర పరిస్థితిలో సంజు శాంసన్, తిలక్ వర్మ, శివం దుబే అదరగొట్టారు. ముఖ్యంగా తిలక్ వర్మ అయితే ఒక దీప శిఖలాగా నిలబడిపోయాడు. గాఢాంధకారం అలముకున్న జట్టులో వెలుగును నింపాడు. దీంతో అసాధ్యం అనుకున్న మ్యాచ్ లో భారత్ గెలుపును సాధ్యం చేసుకుంది.. ముఖ్యంగా రౌఫ్ ఓవర్ లో, అబ్రార్ అహ్మద్ ఓవర్లో తిలక్ వర్మ చూపించిన దూకుడు మామూలుది కాదు. బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. ఒత్తిడి ఎదురవుతున్న వేళ సమయోచితంతో బ్యాటింగ్ చేశాడు. ఏ మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా దుమ్మురేపాడు. ద్వారా టీం ఇండియా అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఒత్తిడిలో టీమిండియా బలం ఏమిటో.. తన స్థాయి ఏమిటో నిరూపించాడు తిలక్ వర్మ. దీంతో అతనిపై జేజేలు కురుస్తున్నాయి. విపరీతంగా ప్రశంసలు లభిస్తున్నాయి.
ఈ మ్యాచ్లో తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే అదృష్టం మాత్రం రింకు సింగ్ ను వరించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు తనకు బ్యాటింగ్ చేసే అవకాశం వస్తుందని.. విన్నింగ్ షాట్ కొడతానని రింకూ సింగ్ తన సహచర ప్లేయర్లతో చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే జరిగింది. శివం దుబే అవుట్ కావడంతో రింకూ కు విన్నింగ్ షాట్ కొట్టే అదృష్టం వరించింది. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం ఓ స్పోర్ట్స్ ఛానల్ ప్రతినిధితో రింకూ పంచుకున్నాడు..” నేను అనుకున్నాను విన్నింగ్ షాట్ కొడతానని.. అదే విషయాన్ని నా సహచర ప్లేయర్లతో చెప్పాను. చివరికి అదే జరిగిందని” రింకూ సింగ్ పేర్కొన్నాడు.