Pakistan: ” మా దేశానికి రండి అద్భుతమైన ఆతిథ్యం అందిస్తాం. అనితర సాధ్యమైన అనుభూతి కల్పిస్తాం. గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని మీకు కానుకగా అందిస్తాం..” ఇదీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత క్రికెట్ బోర్డు ను ఉద్దేశించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన వ్యాఖ్యలు. కానీ వాస్తవంలో అది కార్య రూపం దాల్చలేదు. పైగా పాకిస్తాన్ గొప్పగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్నప్పటికీ.. ఆ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులు దక్కిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎగిరి గంతులు వేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి మైదానాలను ఆధునికరించే పనిలో పడింది. దీనికోసం ఐసీసీ భారీగానే నిధులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అందించింది. 1996 తర్వాత ఐసీసీ నిర్వహించే ఒక మెగా టోర్నికి ఆతిథ్యం ఇవ్వడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇదే తొలిసారి.. దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశం రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హర్షాన్ని వ్యక్తం చేసింది. కచ్చితంగా భారత జట్టు తమ దేశంలో ఆడుతుందని భావించింది. కానీ వాస్తవంగా అది కార్యరూపం దాల్చలేదు. పైగా భారత్ భద్రత కారణాలను ప్రస్తావిస్తూ ఆడేందుకు నిరాకరించింది. దీంతో హైబ్రిడ్ మోడ్ విధానం తెరపైకి వచ్చింది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్ లు ఆడుతోంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. రెండో మ్యాచ్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. అయితే ఈ రెండు జట్లపై కూడా భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించడం విశేషం. ఈ విజయం ద్వారా గ్రూప్ ఏ నుంచి తొలిసారి అఫీషియల్ గా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
రెండు సంవత్సరాలు వృధా
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో న్యూజిలాండ్ జట్టుతో ఫిబ్రవరి 19న తొలి మ్యాచ్ ఆడింది. న్యూజిలాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ 260 పరుగులకు కుప్పకూలింది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ తర్వాత రెండో మ్యాచ్లో భారత జట్టు పై అదే ఫలితాన్ని పునరావృతం చేసుకుంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితిని దాదాపు తెచ్చుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని ఘనంగా నిర్వహించడానికి పాకిస్తాన్ జట్టు గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మైదానాలను ఆధునికరిస్తుంది. దీనికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 13 వేల మందితో భద్రతను కల్పిస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పడుతున్న శ్రమను పాకిస్తాన్ క్రికెట్ జట్టు బూడిదలో పోసిన పన్నీరు చేసింది. దారుణమైన ఆట తీరు ప్రదర్శించి టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించింది. రెండు సంవత్సరాలు పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పడుతున్న ప్రయాసను కేవలం నాలుగు రోజుల్లోనే ముగించింది. అంతకంటే ముందు పాకిస్తాన్ క్రికెట్ జట్టు వన్డే ట్రై సిరీస్లో ఓటమిపాలైంది. న్యూజిలాండ్ జట్టుపై వరుసగా రెండు వన్డేలలో ఓడిపోయింది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. టీమిండియా చేతిలో పరాభవానికి గురైంది. గ్రూప్ – ఏ లో ఇంటికి వెళ్లిన తొలి జట్టుగా అపప్రదను మూటగట్టుకుంది.