Saim Ayub: ఆసియా కప్ ప్రారంభానికి ముందు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు పాకిస్తాన్ జట్టును జాకీలు పెట్టి లేపారు. ముఖ్యంగా ఓపెనర్ సయూమ్ అయూబ్ నైతే సూపర్ హీరోగా అభివర్ణించారు. అతడి దూకుడును ఎవరూ తట్టుకోలేరని.. అతడు తలుచుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేస్తాడని.. అతని పరుగుల దాహానికి బౌలర్లు మొత్తం తలవంచాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ రేంజ్ లో ఎలివేషన్ ఇస్తున్నారు కాబట్టి అతడు ఆ స్థాయి ఆటగాడని చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవం వేరే విధంగా ఉంది.
ఆయూబ్ మాత్రం తన మీద ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏ మాత్రం చెప్పుకోదగ్గ ఆట తీరు ప్రదర్శించలేకపోతున్నాడు. పరుగులు తీయడం కాదు కదా సున్నాలు చుట్టడంలో పోటీ పడుతున్నాడు. ఒమన్ దేశంతో జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక బంతిని ఎదుర్కొని డక్ అవుట్ అయ్యాడు. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో బుమ్రా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత యూఏఈ తో జరుగుతున్న మ్యాచ్లో కూడా రెండు బంతులు ఎదుర్కొన్న అతడు 0 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇలా వరుసగా మూడు మ్యాచ్ లలో 0 పరుగులకు ఔట్ అయి ఆయూబ్ పరువు తీసుకున్నాడు.
ఆయూబ్ అనామక జట్టుపై కూడా 0 పరుగులకు అవుట్ కావడం పట్ల సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి ఆటగాడిని ఓపెనర్ గా ఎలా ఎంపిక చేశారని పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.. ” అంతకుముందు ఇతడిని గొప్ప ఆటగాడు అని పేర్కొన్నారు. బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడతాడని కీర్తించారు. అతని ధాటికి ప్రత్యర్థి బౌలర్లు తట్టుకోలేరని పేర్కొన్నారు. కానీ చివరికి ఇలా జరిగిపోయింది. ఇటువంటి వ్యక్తి ఓపెనర్ ఎలా అవుతాడు.. బీభత్సమైన ఇన్నింగ్స్ ఎలా ఆడతాడు.. ఇదేమీ చిన్న టోర్నీ కాదు కదా.. ఇలాంటి వ్యక్తిని ఓపెనర్ గా నియమించి పరువు తీసుకోవడం మినహా పెద్దగా ఉపయోగం లేదని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.