Peddapally: సమాజంలో రోజురోజుకు పెడ పోకడలు చోటు చేసుకుంటున్నాయి. మనుషుల మధ్య నైతిక సంబంధాలు దూరమవుతున్నాయి. అనైతిక బంధాలు ఏర్పడుతున్నాయి. అవి కాస్త దారుణమైన సంఘటనలకు దారి తీస్తున్నాయి. అటువంటి సంఘటనే ఇది కూడా. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన బంధం వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత రెండు కుటుంబాలలో వివాదాలు మొదలయ్యాయి. చివరికి ఆ మహిళ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
అది తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం అప్పన్నపేట. ఈ గ్రామంలో ఓ యువకుడు ఉన్నాడు.. ఇతడి వయసు 22 సంవత్సరాలు. సామాజిక మాధ్యమాలలో ఈ యువకుడు అత్యంత చురుకుగా ఉంటాడు. ఇతడికి స్నాప్ చాట్ లో 35 సంవత్సరాల మహిళ పరిచయమైంది. ఆమెది సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామం. ఆ యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా మారింది. కొద్దిరోజుల తర్వాత వారిద్దరి మధ్య అనైతిక సంబంధానికి దారితీసింది. భార్య వ్యవహారం తెలిసిన భర్త ఆమెను ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. ఆమెకు 12 సంవత్సరాల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలతో ఆమె బయటికి వచ్చింది. ప్రియుడు ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను వేడుకుంటున్నది.
మొదట్లో ఆ మహిళ వ్యవహారం భర్తకు అంతగా తెలిసేది కాదు. భర్త బయటకు వెళ్లిన వెంటనే ఆమె స్నాప్ చాట్ లో ప్రియుడుతో మాట్లాడుతూ ఉండేది. అప్పుడప్పుడు వారిద్దరూ రహస్యంగా కలుసుకునేవారు. భర్త లేని సమయంలో అతడు ఇంటికి వచ్చి ఆమెతో సరసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. ఇరుగుపొరుగువారు చూసినప్పటికీ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఇటీవల తన భార్య ఫోన్ చూస్తూ ఉండగా వారిద్దరి వ్యవహారం బయటికి రావడంతో ఆ భర్త ఒక్కసారిగా మండిపడ్డాడు. భార్య వ్యవహార శైలి చూసి తట్టుకోలేక బయటకి గెంటేసాడు. పిల్లలతో సహా బయటికి వచ్చిన ఆమె ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతున్నది. ఈ వ్యవహారం పోలీసులు దాకా వెళ్లడంతో.. వారిద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే ఆమెను పెళ్లి చేసుకునేది లేదని ఆ యువకుడు అంటున్నాడు. ఇద్దరి మధ్య దాదాపు 13 సంవత్సరాల వ్యత్యాసం ఉండడంతో పెళ్లి ఎలా చేస్తామని కుటుంబ పెద్దలు అంటున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది.