Pakistan: అప్పుడప్పుడో 1996లో పాకిస్తాన్ జట్టు వన్డే వరల్డ్ కప్ నిర్వహించింది. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాలు అనంతరం ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ దేశంలో భద్రతా కారణాలను చూపిస్తూ భారత్ ఆడేందుకు నిరాకరించింది. తమకు తటస్థ వేదిక మీదనే మ్యాచ్ నిర్వహించాలని సూచించడంతో ఐసీసీ దుబాయ్ వేదికగా భారత్ ఆడే మ్యాచ్లను నిర్వహిస్తోంది.
ఫిబ్రవరి 19న పాకిస్థాన్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. తన తదుపరి మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా భారత్ తో తలపడింది. ఈ మ్యాచ్ లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో పాకిస్తాన్ అనధికారికంగా చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాద గ్రూపులు ఛాంపియన్ ట్రోఫీని టార్గెట్ చేసినట్టు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్లను చూసేందుకు వచ్చిన విదేశీయులను అపహరించడానికి పథకాల రూపొందించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అందువల్లే పాకిస్తాన్లో ప్రస్తుతం హై అలెర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. తెహరిక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP), ISIS, బాలూచిస్తాన్ గ్రూపులు యాక్టివ్ గా ఉన్నట్టు పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఇదే విషయాన్ని కూడా మన దేశ జాతీయ మీడియా ఉటంకించింది.
నాటి నుంచి..
2008లో పాకిస్తాన్ లో శ్రీలంక జట్టు పర్యటించింది. నాడు ఉగ్రవాదులు శ్రీలంక ఆటగాళ్లను టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. అయితే పాకిస్తాన్ పోలీసులు రంగంలోకి దిగడంతో వారు వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా పాకిస్తాన్ దేశంలో ఐసీసీ టోర్నీ నిర్వహించలేదు. మరోవైపు కొంతకాలం వరకు పాకిస్తాన్ దేశంలో ఏ జట్టు కూడా పర్యటించలేదు. ఇక ఇటీవల కాలంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు పాకిస్తాన్లో పర్యటించారు. అయితే పాకిస్తాన్ జట్టు ఈ జట్ల పై ప్రతికూల ఫలితాలనే సాధించింది. ఇక ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రయాణం త్వరగా నే ముగిసింది. సొంత దేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నప్పటికీ ఆ జట్టు ఆట తీరు ఏమాత్రం బాగోలేదు. దానికంటే ముందు వన్డే ట్రై సిరీస్ లో న్యూజిలాండ్ చేతిలో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి.. సిరీస్ కోల్పోయింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ జట్టు సమష్టి వైఫల్యం విజయాకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ఇక ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు టార్గెట్ చేయడం పట్ల క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీయుల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. మరి దీనిపై పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. మరోవైపు 13 వేల మందితో ఛాంపియన్ ట్రోఫీ కి భద్రతను ఏర్పాటు చేసినట్టు ఇటీవలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆటగాళ్లు బస చేసే హోటల్.. ఆడే మైదానం వరకు కనివిని ఎరుగని స్థాయిలో భద్రతను కల్పించినట్లు వివరించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి చాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల నుంచి మప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ ఎలాంటి భద్రతను కల్పిస్తుందని ఆసక్తికరంగా మారింది.