PAk vs BAN : తొలి టెస్ట్ లో పాకిస్తాన్ స్వయంకృతాపధం వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రెండవ టెస్టు లోనూ అదే పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ బౌలర్ షాజాద్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బంతితో మాయ చేసి బంగ్లా బ్యాటర్లను వచ్చిన వాళ్లను వచ్చినట్టే వెనక్కి పంపించాడు. ఫలితంగా 26 పరుగుల్లోపే బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో జట్టు గనుక బౌలింగ్ చేసి ఉంటే కచ్చితంగా బంగ్లాదేశ్ 50 పరుగులకే ప్యాకప్ అయ్యేది. కానీ షాజాద్ లాగా మిగతా బౌలర్లు బౌలింగ్ చేయలేకపోవడంతో బంగ్లా జట్టు కోలుకుంది. ఫినిక్స్ పక్షి లాగా కొత్త శక్తిని సంతరించుకొని ఏకంగా పాకిస్తాన్ జట్టుకు సవాల్ విసిరే స్థాయికి ఎదిగింది.
మిగతా బౌలర్ల నుంచి సహకారం లేక..
రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ 274 రన్స్ చేసింది. పాకిస్తాన్ కు దీటుగా సమాధానం చెప్పాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ కేవలం 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. తీవ్రమైన ఇబ్బందుల్లో పడింది. అయితే బంగ్లాదేశ్ ఆస్థాయిలో వికెట్లు కోల్పోవడం వెనక ప్రధాన కారణం పాకిస్తాన్ యువ పేస్ బౌలర్ ఖుర్రం షాజాద్. బంగ్లాదేశ్ జట్టులోని ముగ్గురు కీలక ఆటగాళ్లను అతడు వెనక్కి పంపించాడు.. శాజాద్ అద్భుతమైన బౌలింగ్ వల్ల బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు.. షాద్ మాన్ ఇస్మాల్ పది పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. షకీబ్ అల్ హసన్ కూడా షాజాద్ చేతికి చిక్కాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఇందులో నాలుగు వికెట్లు షాజాద్ తీసినవే.. మెహదీ ని ఔట్ చేసి ఫైవ్ వికెట్ హాల్ లో చేరుకున్నాడు. షాజాద్ తన కెరియర్లో మూడవ టెస్ట్ మాత్రమే ఆడుతున్నాడు. తస్కిన్ ను వెనక్కి పంపడం ద్వారా తన ఆరు వికెట్ల ఘనతను పూర్తి చేశాడు..
గత మూడు సంవత్సరాలుగా..
గత మూడు సంవత్సరాలుగా ఏ పాకిస్తాన్ పేస్ బౌలర్ కూడా సొంత దేశంలో టెస్ట్ లలో ఐదు వికెట్లు తీయలేదు. ఆ లోటును షాజాద్ భర్తీ చేశాడు. అంతేకాదు మూడు సంవత్సరాలలో ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి పాకిస్తాన్ బౌలర్ గా షాజాద్ అవతరించాడు.. 2021లో ఫిబ్రవరిలో పాకిస్తాన్ దక్షిణాఫ్రికా తో రావల్పిండి వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలో షాజాద్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. ఆ తర్వాత ఇంతవరకు మరో టెస్ట్ విజయాన్ని అందుకోలేకపోయింది.