Yuvraj Singh’s father Yog Raj : యువరాజ్ సింగ్ కెరియర్ నాలుగేళ్ల ముందుగానే ముగియడానికి ప్రధాన కారణం ధోని అని ఆయన తండ్రి యోగ్ రాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కేవలం ధోని మాత్రమే కాదు కపిల్ దేవ్ ను సైతం ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో యోగ్ రాజ్ పై ధోని అభిమానులు మండిపడుతున్నారు. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. ఎందుకైనా మంచిది సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ ను యోగ్ రాజ్ కు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఐపీఎల్లో సచిన్ – అర్జున్ కలిసి ఆడారు. ఐపీఎల్ ఆడిన తొలి తండ్రి కొడుకులుగా వారిద్దరూ చరిత్ర సృష్టించారు. ఈ సమయంలో అర్జున్ ను అద్భుతమైన క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు సచిన్ తన తండ్రితో సంప్రదింపులు జరిపారని, ఒకసారి కలిశారని యువరాజ్ సింగ్ ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో వెల్లడించారు. ఇదే విషయాన్ని యోగ్ రాజ్ కూడా ధ్రువీకరించారు. “వజ్రాన్ని బొగ్గు గనుల్లో చూసేందుకు అవకాశం ఉండదు. వజ్రం మెరవాలంటే కచ్చితంగా సరైన వ్యక్తి చేతిలోనే అది రూపుదిద్దుకోవాలి. అప్పుడే అది అద్భుతంగా మారుతుంది. విలువ తెలియని వారి చేతిలోకి వజ్రం వెళితే రెండు ముక్కలవుతుందని” యోగ్ రాజ్ వ్యాఖ్యానించారు. దీంతో ధోని అభిమానులు ఆయనపై తీవ్రంగా మండి పడటం మొదలుపెట్టారు. గొప్ప గొప్ప క్రికెటర్లకు విలువనివ్వని నువ్వు.. కుర్ర ఆటగాళ్లకు ఎలా శిక్షణ ఇస్తావని విమర్శించారు..
ధోనీని క్షమించలేను..
యువరాజ్ సింగ్ కెరియర్ ను ధోని నాశనం చేశాడని.. అతడిని తాను ఎప్పటికీ క్షమించలేనని యోగ్ రాజ్ పేర్కొన్నాడు..” 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆటగాడి కెరియర్ మరింత ముందుకు వెళ్లాల్సిన సమయంలో ధోని అడ్డుకున్నాడు.. మరో నాలుగేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశాన్ని యువరాజ్ సింగ్ కు దక్కకుండా ధోని చేశాడు. కపిల్ దేవ్ కేవలం 1983 వన్డే వరల్డ్ కప్ మాత్రమే అందించాడు. కానీ యువరాజ్ సింగ్ 13 మేజర్ టైటిల్స్ ఇండియాకు అందించేందుకు కృషి చేశాడు. అయినప్పటికీ అతడికి దక్కాల్సిన గౌరవం లభించలేదు. ఇంతకంటే ఒక తండ్రిగా నాకు దారుణమైన బాధ ఇంకేముందని” యోగ్ రాజ్ పేర్కొన్నాడు. కాగా సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు శిక్షణ ఇచ్చేందుకు యోగ్ రాజ్ ను సంప్రదించడం పట్ల అతడి అభిమానులు మండిపడుతున్నారు.. సచిన్ కుమారుడి కెరియర్ నాశనం చేయొద్దని యోగ్ రాజ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు.