Olympics 2028: పారిస్ ఒలంపిక్స్ ముగిసాయి. మరో మూడు సంవత్సరాలలో లాస్ ఏంజిల్స్ వేదికగా ఒలంపిక్స్ జరగబోతున్నాయి. ఒలంపిక్స్ అంటేనే అంతర్జాతీయంగా క్రీడాకారులకు ఒక రకమైన ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంటుంది. పైగా ఒలంపిక్స్ పోటీపడి మెడల్ సాధించాలని ప్రతి ప్లేయర్ కోరుకుంటాడు. చాలామంది ప్లేయర్లు ఒలంపిక్స్ లో పోటీపడి మెడల్స్ అందుకోవాలని తమ జీవితాశయంగా పెట్టుకుంటారు. దీనికోసమే అహర్నిశలు శ్రమిస్తుంటారు. తమ జీవితం మొత్తంలో చాలా భాగం మైదానానికి అంకితం చేస్తుంటారు.
ఒలంపిక్స్ అంటేనే విపరీతమైన ఉత్సాహం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా మొత్తం ఒలంపిక్స్ వైపు ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఒలంపిక్స్ లో పాల్గొనాలని.. ఆటల్లో సత్తా చూపించాలని.. మెడల్స్ సాధించాలని అన్ని దేశాల ప్లేయర్లు కోరుకుంటారు.. అయితే లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లో ఈసారి క్రికెట్ భాగం కాబోతోంది. క్రికెట్లో అన్ని జట్లు పాల్గొనబోతున్నాయి.. ఇందులో పాకిస్తాన్ ఆడేది అనుమానంగానే ఉంది.. దీంతో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.. దీనికి ప్రధాన కారణం కూడా ఒకటుంది. ఒలంపిక్స్ పోటీలలో పాల్గొనడానికి ఒక్కో ఖండం నుంచి ఒక జట్టును మాత్రమే పంపించాలని ఐసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్ట్, టి20, వన్డే ఫార్మాట్లో టీమిండియా పాకిస్తాన్ కంటే హై పొజిషన్లో ఉంది.. టెస్ట్ ఫార్మాట్ (డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ ప్రకారం) లో మూడో స్థానం, వన్డే, టి20 ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానంలో టీమ్ ఇండియా కొనసాగుతోంది.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్న నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కేవలం ఐసీసీ నిర్వహిస్తున్న మేజర్ టోర్నీలలో మాత్రమే భారత్, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి.. అదికూడా తటస్థ వేదికల మీద మాత్రమే ఆడుతున్నాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. టి20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగింది కాబట్టి అక్కడి మైదానాలలో ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఆసియా కప్ కూడా దుబాయ్ వేదికగా జరగడంతో.. అక్కడే ఈ రెండు జట్లు పోటీపడ్డాయి. ఇక త్వరలో జరిగే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్తాన్ శ్రీలంకలో తలపడతాయని తెలుస్తోంది. మరోవైపు ఒలంపిక్స్ లో టీమిండియా, పాకిస్తాన్ ఆడే విషయానికి సంబంధించి త్వరలోనే క్లారిటీ వస్తుందని ఐసిసి వర్గాలు అంటున్నాయి.