Nitish Kumar Reddy : భారత విధించిన 19 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 3 ఓవర్లలోనే చేదించింది. ఈ క్రమంలో రెండవ ఇన్నింగ్స్ లో నితీష్ కుమార్ రెడ్డి చేసిన 42 పరుగులు హైయెస్ట్ స్కోర్ గా నిలిచాయి. మొదటి ఇన్నింగ్స్ లోనూ అతడు 42 పరుగులు చేశాడు. అటు తొలి, ఇటు తుది ఇన్నింగ్స్ లలో 42 పరుగుల చొప్పున రెండుసార్లు చేయడంతో.. రెండుసార్లు టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజాల సరసన అతడు చేరాడు. ఏడవ లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నితీష్ కుమార్ రెడ్డి నిలిచాడు. 1961 -62 మధ్యకాలంలో భారత్ – ఇంగ్లాండ్ జట్లు కోల్ కతా వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత ఆటగాడు చందు బోర్డే ఏడవ స్థానంలో వచ్చి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. 2011లో ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో నాటి టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏడవ స్థానంలో వచ్చి ఎక్కువ పరుగులు చేశాడు. 2018లో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. ఇక 2024 డిసెంబర్ నెలలో ఆడిలైడ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఏడవ స్థానంలో వచ్చి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రెండుసార్లు అతను 42 పరుగుల చొప్పున స్కోర్ చేసి.. అదరగొట్టాడు. టీమిండియా కు ఇన్నింగ్స్ ఓటమిని దూరం చేశాడు. అతడు గనుక ఆ స్థాయిలో ఆడకపోయి ఉంటే ఇండియా ఓటమి మరింత దారుణంగా ఉండేది.
తెలుగోడి సత్తా
ఐపీఎల్ లో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. ఆ తర్వాత టి20 లలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎంతో పోటీ ఉన్నప్పటికీ.. తనకు సాధ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తూ.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడుతూ.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. గొప్ప గొప్ప ఆటగాళ్లు విఫలమైన చోట.. అతడు దృఢంగా ఉంటున్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల ద్వారా ప్రశంసలు అందుకుంటున్నాడు. మన దేశానికి చెందిన లెజెండరీ ఆటగాళ్లు కూడా నితీష్ కుమార్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఇటీవల సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. నితీష్ కుమార్ రెడ్డి తనను తాను సాన పెట్టుకుంటున్నాడని.. అతడు ఇదే స్థాయిలో ఆట తీరును ప్రదర్శిస్తే భవిష్యత్తులో టీమిండియా కు తిరుగులేని ఆటగాడు అవుతాడని పేర్కొన్నాడు. అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే జట్టుకు మూల స్తంభం లాగా నిలుస్తాడని కొనియాడాడు. అతడిలో దాగి ఉన్న ప్రతిభ మరింతగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా బీసీసీఐ సెలెక్టర్లు కృషి చేయాలని అతడు సూచించాడు.