Homeక్రీడలుక్రికెట్‌Nitish Kumar Reddy: బాధలో ఉన్న అల్లు అర్జున్ కు నితీష్ కుమార్ రెడ్డి బూస్ట్.....

Nitish Kumar Reddy: బాధలో ఉన్న అల్లు అర్జున్ కు నితీష్ కుమార్ రెడ్డి బూస్ట్.. ఆ ఒక్క మేనరిజంతో ఉత్సాహం!

Nitish Kumar Reddy: ఈ ఘటన నేపథ్యంలో పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ పై విమర్శలు చెలరేగాయి. చిక్కడపల్లి పోలీసులకు రేవతి భర్త ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. బెయిల్ తీసుకు రావడంతో 16 గంటల పాటు జైలు శిక్ష అనుభవించి అల్లు అర్జున్ విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన మద్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా మాట్లాడారు. అల్లు అర్జున్ కనుక ఆరోజు చెయ్యి ఊపి ప్రేక్షకులకు అభివాదం చేయకుండా ఉండి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని రేవంత్ రెడ్డి అన్నారు. చనిపోయిన రేవతి కుటుంబాన్ని పరామర్శించకుండా.. సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించడాన్ని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. ఇది సరైన పద్ధతి కాదని.. ఇకపై బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షో లు ఉండవని.. టికెట్ రేట్ల పెంపుదల కుదరదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇటీవల పోలీస్ కమాండ్ సెంటర్లో రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖులు భేటీ అయిన సందర్భంలోనూ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ సినిమా పరిశ్రమ గమ్యస్థానంగా రూపొందించాలని సినీ ప్రముఖులకు ఆయన సూచించారు.

అర్జున్ బాధను మరిపించిన నితీష్ కుమార్ రెడ్డి..

రేవతి చనిపోయిన నేపథ్యంలో.. జైలుకు వెళ్లడం.. బెయిల్ మీద విడుదల కావడం.. మళ్లీ చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలవడంతో ఒకరకంగా అల్లు అర్జున్ తీవ్రమైన నిర్వేదంలో ఉన్నారు. ఈ ఘటన రాజకీయ అంశంగా మారడంతో ఆయనకు తలనొప్పి మరింత పెరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీకి హాజరైనప్పటికీ ముభావంగానే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ మామ ఆ మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లి దీపా దాస్ మున్షీ ని కలవడానికి వెళ్లారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య టీమిండియా యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మెల్ బోర్న్ మైదానంలో హాఫ్ సెంచరీ చేశాడు. 50 పరుగులు చేసిన తర్వాత పుష్ప -2 సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా తగ్గేదే లేదు అన్నట్టుగా మేనరిజాన్ని ప్రదర్శించాడు. ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది. హిందీ బెల్ట్ లో అయితే రచ్చ రచ్చ అవుతున్నది. దీంతో అల్లు అర్జున్ బాధను నితీష్ కుమార్ రెడ్డి కొంతలో కొంత తగ్గించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత చేసిన అభివాదాన్ని పుష్ప -2 సినిమాలో అల్లు అర్జున్ ప్రదర్శించిన మేనరిజంతో పోల్చుతూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version