NZ Vs AUS: ఇది బ్యాటింగా? న్యూజిలాండ్ ఇక మారదా? రెండు టెస్టులోనూ అదే తీరా?

శుక్రవారం క్రైస్ట్ చర్చి వేదికగా ప్రారంభమైన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిర్ణయం సబబే అని నిరూపిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు.

Written By: Suresh, Updated On : March 8, 2024 11:07 am

NZ Vs AUS

Follow us on

NZ Vs AUS: ఆడుతోంది సొంతమైదానంలో.. అలాంటప్పుడు బ్యాటింగ్ ఎలా ఉండాలి? వీర విహారం చేయాలి.. పోనీ అలా కుదరదు అనుకున్నప్పుడు గౌరవప్రదమైన స్కోరయినా చేయాలి. ఎలాగూ సొంత ప్రేక్షకుల అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. కానీ న్యూజిలాండ్ కు ఇవేవీ కలిసి రావడం లేదు. పైగా ఆ జట్టు నానాటికి తీసి కట్టు.. నామం బొట్టు అనే తీరుగా ఆడుతోంది. తొలి టెస్ట్ లో 172 పరుగుల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న న్యూజిలాండ్ జట్టు.. శుక్రవారం ప్రారంభమైన రెండవ టెస్టులోనూ అదే తీరు కొనసాగిస్తోంది. సాధారణంగా న్యూజిలాండ్ మైదానాలు బౌలింగ్ కు అనుకూలిస్తాయంటారు. అదే సమయంలో దూకుడు మొదలు పెడితే బ్యాటరీ కూడా పండగ చేసుకోవచ్చని చెబుతుంటారు. కానీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఇంతవరకు ప్రత్యర్థి జట్టుపై పరాక్రమం చూపించిన దాఖలాలు కనిపించడం లేదు.

శుక్రవారం క్రైస్ట్ చర్చి వేదికగా ప్రారంభమైన రెండవ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిర్ణయం సబబే అని నిరూపిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు. 47 పరుగుల వద్ద స్టార్క్
యంగ్ రూపంలో తొలి వికెట్ దక్కించుకున్నాడు. అదే ఊపులో కుగేల్ జెన్, ఫిలిప్స్ వికెట్లను కూడా అతడు పడగొట్టాడు..స్టార్క్ పునాది వేస్తే.. హజిల్ వుడ్ మరింత విధ్వంసం చేశాడు. లాతం, విలియంసన్, రచిన్ రవీంద్ర, మిచెల్, హెన్రీ ఇలా ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను పేక మేడ చేశాడు. ఒకానొక దశలో 107 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి దీన స్థితిలో ఉన్న న్యూజిలాండ్ జట్టును సౌతి, హెన్రీ ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదవ వికెట్ కు 55 పరుగులు జోడించారు. హెన్రీ, సౌతి వెంట వెంటనే అవుట్ కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 162 పరుగుల వద్ద ముగిసింది.. న్యూజిలాండ్ బ్యాటర్లలో లాతం(38), హెన్రీ(29), సౌతి(26), బ్లండిల్(22) మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లు విలియంసన్, కుగెల్ జెన్, రవీంద్ర, మిచెల్ విఫలమయ్యారు. కమిన్స్, గ్రీన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు స్మిత్, ఖవాజా వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా స్కోరు 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు స్మిత్ బెన్ సీయర్స్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. 32 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఉస్మాన్ ఖావాజా హెన్రీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అంతకుముందు జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 172 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు జరిగిన మూడు టి20ల సిరీస్ ను 3-0 తేడాతో గెలుపొందింది.