https://oktelugu.com/

Varanasi Cricket Stadium : ఢమరుకం లాంటి ఎంట్రన్స్‌, త్రిశూలం లాంటి ఫ్లడ్‌ లైట్స్‌.. శివతత్వం ఉట్టి పడేలా వారణాసి అద్భుత క్రికెట్ స్టేడియం

ఈ స్టేడియం నిర్మాణానికి 23న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. 450 కోట్ల వ్యయంతో 33 వేల మంది సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు.

Written By:
  • Rocky
  • , Updated On : September 21, 2023 10:00 pm
    varanasi

    varanasi

    Follow us on

    Varanasi Cricket Stadium : క్రికెట్‌.. ఇది ఇంగ్లాండ్‌ లో పుట్టినప్పటికీ.. ఆ తెల్ల దేశం కంటే మన దేశమే ఎక్కువగా ఓన్‌ చేసుకుంది. అందుకే ప్రపంచం మీద మన బీసీసీఐ పెత్తనం చేస్తోంది. శ్రీమంతమైన బోర్డుగా వెలుగొందుతోంది. మన దేశం ప్రమేయం లేకుండా క్రికెట్‌ టోర్నీలు నిర్వహించలేని స్థితిలో ఉంది. మనదేశంలో క్రికెట్‌ ను ప్రజలు విపరీతంగా ఆరాధిస్తారు. క్రికెటర్లను దైవాంశసంభూతులుగా కీర్తిస్తారు. క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా ఐసీసీ కూడా మనదేశంలో ఎక్కువగా టోర్నీలు నిర్వహిస్తుంది. ఇతర దేశాల్లో కూడా టోర్నీల నిర్వహణకు మొగ్గు చూపుతూ ఉంటుంది.

    క్రికెట్‌ కు ఉన్న ఆదరణ దృష్ట్యా చాలా మంది యువకులు క్రికెట్‌నే కెరియర్‌గా ఎంచుకుంటున్నారు. క్రికెట్‌ చూసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటున్నది. భారత్‌ ఆడే ఏ మ్యాచ్‌ అయినా కోట్లల్లో వ్యూస్‌ నమోదవుతున్నాయి. ఉదాహరణకు ఇటీవల భారత్‌, బంగ్లాదేశ్‌ ఆడిన మ్యాచ్‌ ఏకంగా రెండు కోట్ల వ్యూస్‌ నమోదు చేసుకుందంటే క్రికెట్‌ను దేశ ప్రజలు ఏ స్థాయిలో అభిమానిస్తారో, క్రికెటర్లను ఏ స్థాయిలో ఆరాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలో దేశంలో క్రికెట్‌కు ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు.. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, హంగుల కొత్త స్టేడియాల నిర్మాణంపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికే సనాతన ధర్మం ఉట్టి పడే విధంగా పార్లమెంట్‌, భారత్‌ మండపం, యశోభూమిని నిర్మించిన కేంద్రం.. ఇప్పుడు తాజాగా నిర్మించబోయే క్రికెట్‌ మైదానాన్ని కూడా అదే స్థాయిలో నిర్మించబోతోంది.

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కొత్త అంతర్జాతయీ క్రికెట్‌ మైదానం నిర్మాణానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే దేశంలో చాలానే అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ స్టేడియాలు ఉన్నాయి. వాటికి భిన్నంగా అధునాతన సౌకర్యాలు, కొత్త కొత్త హంగులతో వారణాసి స్టేడియాన్ని నిర్మించనున్నారు. ఈ స్టేడియం నిర్మాణానికి ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చాలా వినూత్నంగా ‘శివుడి’ థీమ్‌ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఢమరుకం ఆకారంలో ప్రవేశ ద్వారం, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్‌ లైట్‌ పోల్స్‌, ఇలా ప్రతీ అంశంలో శివతత్వం ఉండే విధంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన నమూనా చిత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టేడియం నిర్మాణానికి 23న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. 450 కోట్ల వ్యయంతో 33 వేల మంది సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు.